ఇక అక్కడ సెల్ఫీలు నిషేధం..

SMTV Desk 2018-03-25 14:36:03  Selfies banned at cannes, cannes Film Festival

పారిస్, మార్చి 25 : "కేన్స్‌" వంటి చిత్రోత్సవాలలో తారలు హోయలొలికిస్తూ రెడ్ కార్పెట్ పై నడుస్తుంటే.. సినీ అభిమానులకు కనువిందు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కెమెరా ఫ్లాష్‌లైట్‌ల మధ్య ఆ ఉత్సాహభరితమైన వాతావరణంలో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. కాని ఇకపై కేన్స్‌ చిత్రోత్సవాల్లో ప్రేక్షకులు సెల్ఫీలు దిగేందుకు అనుమతించరు. ఈ విషయంపై కేన్స్‌ చిత్రోత్సవ నిర్వాహకుడు థెర్రీ ఫ్రెమాక్స్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "రెడ్‌ కార్పెట్‌పై ప్రేక్షకులు సెల్ఫీలు దిగడాన్ని నిషేధిస్తున్నాం. సెల్ఫీల కారణంగా ప్రదర్శనకు వెళ్లేప్పుడు చాలా మంది క్రమంలో వెళ్లకుండా నిలిచిపోతున్నారు. ఇది మొత్తం కార్యక్రమంపైనే ప్రభావం చూపిస్తోంది. ఈ నిర్ణయం ప్రీమియర్స్‌ గౌరవాన్ని, ప్రతిష్ఠను కాపాడతాయి" అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. తాజా నిర్ణయం కేవలం ప్రేక్షకులకు మాత్రమే వర్తింస్తుందా? లేక ఆయా సినిమాల తారాగణానికి కూడా వర్తింపజేస్తారా? అనే విషయంపై స్పష్టత లేదు.