భారత్‌లో పాక్‌ జెండా ఆవిష్కరణ

SMTV Desk 2018-03-24 10:39:34   pakisthan flag, srinagar,India

శ్రీనగర్, మార్చి 24 : కశ్మీర్‌లో మరో సంచలనాత్మక సంఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్‌ దినోత్సవం (మార్చి 23) సందర్భంగా కశ్మీర్‌ వేర్పాటువాది ఆసియా అంద్రాబీ శ్రీనగర్‌లో సభను ఏర్పాటు చేసి పాక్‌ జాతీయ గీతాన్ని అలపించారు. ఆ తర్వాత ఆ దేశ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. దుఖ్తారాన్‌-ఏ-మిలాత్‌ సంస్థ అధ్యక్షురాలు ఆసియా అంద్రాబీ శుక్రవారం ఈ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత ఉపఖండంలో ఉన్నవారంతా పాకిస్తానీయులే అన్నారు. 1987లో ప్రారంభమైన ఈ సంస్థ కశ్మీర్‌ వేర్పాటు కోసం, కశ్మీర్‌లో ఇస్లామిక్‌ లా అమలుకోసం పోరాడుతోంది. ఈమెను ఇస్లామిక్‌ ఫెమినిస్ట్‌ అని కూడా అంటారు. ఈ సంస్థను ఉగ్రవాద ప్రేరేపిత సంస్థగా భారత ప్రభుత్వం గతంలోనే గుర్తించింది. సభ అనంతరం ఆమెపై కశ్మీర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవరకు స్పందించలేదు. దుఖ్తారాన్‌-ఏ-మిలాత్‌ సంస్థ గతంలో కూడా ఇలాంటి వివాదాస్పద కార్యక్రమాలను నిర్వహించింది.