పాన్ కు ఆధార్ అనుసంధానం చేయడానికి ఇంకా సమయం ఉందా?

SMTV Desk 2017-06-29 19:50:22  Aadhar linking with PAN, Indian Government,

న్యూఢిల్లీ, జూన్ 29 : పాన్ కార్డును జూలై 1 వరకు ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేసుకోకపోతే అప్పటి నుంచి పాన్ ను మళ్ళీ ఉపయోగించలేని పరిస్థితి ఏర్పడుతుందని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. కానీ అలా అనుసంధానం చేసుకోవడానికి చివరి తేది జూలై 1 మాత్రం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన సెక్షన్ 139ఏఏ ప్రకారం జూలై 1 2017 కి ముందు పాన్ నంబర్ జారీ అయిన వారదందరూ ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయకపోతే పాన్ కార్డ్ నిరుపయోగం అవుతుందని భయబ్రాంతులకు గురి అయ్యారు. ఆధార్ ను అనుసంధానం చేసుకోవడానికి అదే చివరి తేదీ అని భావించి రిజిస్ట్రేషన్ కోసం ప్రయత్నించగా ఈ-ఫైలింగ్ వెబ్ సైట్ నెమ్మదించింది. ఇక జూలై 1 తరవాత నుంచి కొత్త పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మాత్రం తప్పనిసరిగా ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయాలని ప్రభుత్వం సూచించింది. ఆధార్ అనుసంధానానికి ఇంకా ప్రభుత్వం చివరి తేదీని ప్రకటించలేదు. కాబట్టి జూలై 1 తర్వాత కూడా అనుసంధానం చేసుకునే సదుపాయం ఉన్నందున, ఇప్పటి వరకు అనుసంధానం చేయని వారంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, త్వరలోనే ఒక నిర్దిష్ట తేదీని ప్రకటిస్తామని ప్రభుత్వం పేర్కొంది.