అన్నాహజారే నిరవధిక నిరసన దీక్ష

SMTV Desk 2018-03-23 15:27:26  anna hajare, hunger strike, lokhpal

న్యూఢిల్లీ, మార్చి 23: అవినీతి వ్యతిరేక ఉద్యమంతో దాదాపు ఏడేళ్ల కిందట అప్పటి మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ను ఊపేసిన సామాజిక కార్యకర్త అన్నా హజారే శుక్రవారం నుంచి మరోసారి నిరవధిక నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టారు. ఢిల్లీలోని చారిత్రక రామ్‌లీలా మైదానంలో శుక్రవారం ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తొలుత రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించిన హజారే.. అక్కడి నుంచి షాహీద్‌ పార్కు వరకు తన అనుచరులతో ర్యాలీగా వెళ్లారు. అనంతరం రామ్‌లీలా మైదానంలో నిరసన దీక్షకు కూర్చున్నారు. లోక్‌పాల్‌ చట్టం కోసం 2011లో హజారే నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. అవినీతిని నిర్మూలించేందుకు లోక్‌పాల్ చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ 2011 ఏప్రిల్‌ 5న నిరసన దీక్షకు దిగారు. ఆయన ఉద్యమానికి మేధా పాట్కర్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, కిరణ్‌బేడీ, జయప్రకాశ్‌ నారాయణ తదితరులు మద్దతు పలికారు. ఆయన ఉద్యమంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం దిగొచ్చింది. లోక్‌పాల్‌ చట్టాన్ని ఏర్పాటు చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో 98 గంటల అనంతరం ఏప్రిల్‌ 9న హజారే దీక్ష విరమించారు.