అమ్మాయిలు పన్ను చెల్లించనక్కరలేదు

SMTV Desk 2017-06-29 18:39:02  Indians, Gulf Countries, Saudi Arebiya, Dependent Fee,

హైదరాబాద్, జూన్ 29 : గత కొద్ది సంవత్సరాల నుంచి భారతీయులు ఉద్యోగాల కోసం గల్ప్ దేశాలకు వలస వెళ్తున్నారు. భారత దేశంలోని తెలుగు రాష్ట్రాల పౌరులు ఎక్కువగా వలస వెళ్ళే దేశాలలో ఒకటైన సౌదీ అరేబియాలో ప్రస్తుతం కష్టాలను ఎదుర్కొంటున్నారు. సౌదీ అరేబియాకు వలసగా వచ్చే విదేశీయులపై డిపెండెంట్ ఫీ పేరుతో జూలై 1 నుంచి అమలవుతున్న కుటుంబ పన్ను చెల్లించడానికి సంబంధించి తగిన మార్గదర్శకాలను విడుదల చేస్తూ అక్కడి ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పన్ను విధించడం వల్ల భారతీయులతో సహా ఇతర దేశాలకు చెందిన వ్యక్తులలో ఆందోళన మొదలయ్యింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అమ్మాయిలు, 18 సంవత్సరాల లోపు అబ్బాయిలకు పన్ను విధించబోమని స్పష్టం చేసింది. కేవలం కుటుంబంలో తల్లిదండ్రులు, 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువకుల నుంచి పన్ను వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. ఒక్కో కుటుంబ సభ్యుడు నెలకు 100 సౌదీ రియాళ్ళు (మన కరెన్సీ ప్రకారం రూ. 1721లు ) చొప్పున 2017 జూలై నుంచి 2018 జూన్ వరకు చెల్లించాలని, ఆ తర్వాత ప్రతి సంవత్సరం పన్ను పెరుగుతుందని తెలిపింది. 2018 జూలై నుంచి ఒక్కరు 200 రియాళ్ళు, 2019 నుంచి 300 రియాళ్ళు, 2020 నుంచి 400 రియాళ్ళ చొప్పున చెల్లించాలని సూచించింది. సంవత్సర రుసుములు ఒకేసారి చెల్లించే సౌకర్యాన్ని కల్పించినట్లు పేర్కొంది. కుటుంబ పన్ను చెల్లించడమంటే వేతనంలో పది శాతం వరకు ఇవ్వవలసి ఉంటుందని అది తలకు మించిన భారమని, సౌదీలో నిర్మాణ సంస్థలో పని చేస్తున్న ఓ ఉద్యోగి తెలిపారు. ఎన్నో కష్టాలను అనుభవించి సౌదీలో ఉద్యోగం కోసం వస్తే ఇక్కడి ప్రభుత్వం విపరీతమైన పన్నును విధించడం సమంజసం కాదని ఐటీ కంపెనీలో పనిచేసే కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తీ అభిప్రాయపడ్డారు. తెలంగాణకు చెందిన వారు 2.10 లక్షల మందికి పైగా ఉండడంతో వీరిలో 42 వేల మంది కుటుంబాలతో పాటు సౌదీలో జీవనం కొనసాగిస్తున్నారు. వారందరు పన్ను తప్పనిసరిగా చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వ గణాంకాలు వివరిస్తున్నాయి.