ఫేస్‌బుక్‌కు భారత్‌ వార్నింగ్‌..

SMTV Desk 2018-03-21 17:32:14  facebook, warning, IT minister, Ravishankar

న్యూఢిల్లీ, మార్చి 21: ఫేస్‌బుక్‌ ద్వారా కోట్లాది మంది వ్యక్తిగత సమాచారం దుర్వినయోగమైందని వస్తున్న ఆరోపణలపై కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ బుధవారం స్పందించారు. భారత ఎన్నికల ప్రక్రియను ఫేస్‌బుక్‌ ఏమాత్రం ప్రభావితం చేసినా సహించబోయేది లేదని ఆయన హెచ్చరించారు. అవసరమైతే ఫేస్‌బుక్‌పై ఎటువంటి కఠిన చర్యలైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రభుత్వం ఎప్పటికీ మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు. దిల్లీలోని పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. కేంబ్రిడ్జి అనలిటికాతో కాంగ్రెస్‌ పార్టీకి సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ఫేస్‌బుక్‌ వ్యవస్థ ద్వారా భారతీయులకు సంబంధించిన ఎటువంటి డేటా అయిన అపహరణకు గురైతే దాన్ని ఎంతమాత్రం సహించం. అందుకు ఐటీ చట్టం కింద కఠిన శిక్షలు ఉంటాయి. మీకు సమన్లు పంపే అధికారం కూడా మాకు ఉంటుంది’ అని రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు.