ఆ 39 మంది ఇక లేరు..

SMTV Desk 2018-03-20 16:20:23  Sushma Swaraj, External Affairs Minister, rajyasabha, iraq incident

న్యూఢిల్లీ, మార్చి 20: ఉపాధికోసం పరాయిదేశానికి వెళ్లిన భారతీయల కథ విషాదంగా ముగిసింది. నాలుగు సంవత్సరాల క్రితం ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు బందీలుగా చేసుకున్న 39 మంది భారతీయుల వస్తారన్న ఆశలు ఆవిరయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ మంగళవారం రాజ్యసభలో తెలిపారు. చాలా రోజుల విచారణ తర్వాత ఆ 39 మంది మృతి చెందినట్లు ఆమె సభలో వెల్లడించారు. 2014లో ఇరాక్ లోని రెండో అతిపెద్ద నగరం మోసుల్‌ను ఐసిస్ ఉగ్రవాదులు తమ అధినంలోకి తెచ్చుకున్నారు. చాలా మంది భారతీయులు అక్కడ నుండి వచ్చేయగా కొంతమంది ఉగ్రచెరలో చిక్కుకున్నారు. వారిలో 39 మంది మందిని గుర్తించిన భారత అధికారులు, విడుదలకోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ అప్పటికే ఐసిస్‌ పెద్ద ఎత్తున నరమేధాలకు పాల్పడి, బందీలుగా చిక్కిన విదేశీయులను ఎక్కడిక్కడే చంపేసింది. "డీఎన్‌ఏ పరీక్షల కొరకు వారి మృతదేహాలను బాగ్దాద్‌కు పంపించారు. వీరిలో 38 మంది డీఎన్‌ఏ వారి బంధువుల డీఎన్‌ఏతో సరిపోయింది. ఒక్కరిది మాత్రం 70శాతం కలిసినట్లు ఇరాక్‌ అధికారులు సోమవారం సమాచారం పంపారు. భౌతికకాయాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర మంత్రి వీకే సింగ్‌ ఇరాక్‌ వెళ్తారు. మృతదేహాలను తీసుకొచ్చే విమానం తొలుత అమృత్‌సర్‌, తర్వాత పట్నా, కోలక్‌తా వెళ్తుంది’ అని సుష్మాస్వరాజ్‌ రాజ్యసభలో పేర్కొన్నారు. ఇరాక్‌లో మృతి చెందిన 39 మంది భారతీయులకు పార్లమెంట్‌ నివాళి అర్పించింది. రాజ్యసభలో రెండు నిమిషాలు మౌనం పాటించగా, లోక్‌సభలో తీర్మానాన్ని ఆమోదించారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి సుష్మాస్వరాజ్‌ తెలిపారు.