ఆత్మగౌరవాన్ని చంపుకోలే౦ : చంద్రబాబు

SMTV Desk 2018-03-18 15:21:13  UGADI FESTIVAL, CM CHANDRABABU NAIDU, MODI, VIJAYAWADA.

అమరావతి, మార్చి 18 : ఉగాది పర్వదిన౦ సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఉగాది పండగ మన సంప్రదాయం. మన వారసత్వ౦. ఈ ప్రపంచమంతా ఆంగ్ల క్యాలెండర్ ను అనుసరించినా.. తెలుగు వారికి మాత్రం ఉగాది నూతన సంవత్సర౦. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు జీవితంలోని వివిధ కోణాలను ప్రతిబింబిస్తాయన్నారు. ప్రత్యేక హోదాపై పలుమార్లు ఎలాంటి బేషజాలకు పోకుండా కేంద్రంపై ఒత్తిడి తెచ్చానని, కాని కేంద్రం విభజన హామీలను అమలు చేయడంలో ఇంత నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పుకొచ్చారు. కేంద్రంలో ఉన్న బీజేపీ యుద్ద౦ చేస్తానంటోంది. ఎవరిపై చేస్తారు.. మొత్తం తెలుగు జాతిపైనా.? అంటూ ప్రశ్నించారు. కొందరు నేతలు రక్షణ శాఖ నిధులు కూడా అడుగుతారంటూ హేళన చేశారని.. మనం రక్షణ శాఖ డబ్బులు అడుగుతామా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు. ఏది లేకపోయినా ఉంటాం కానీ.. ఆత్మగౌరవాన్ని చంపుకోలేమని ముఖ్యమంత్రి ఉద్వేగంగా చెప్పారు. జాతి ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లో తాకట్టు పెట్టే పరిస్థితి లేదని.. ఇందుకు అందరి సాయం కావాలని కోరారు. తానూ ఒక్కడిని బలహీన పడితే రాష్ట్రమంతా బలహీనపడుతుందని వ్యాఖ్యానించారు.