రూ.200 ల నోటు విడుదలకు సిద్దమైన ఆర్‌బీఐ

SMTV Desk 2017-06-29 15:31:43  500, 1000 Rs currency demonetization, Madhyapradesh Hoshangabad, SBI, RBI, 200 Rs. currency

ముంబాయి, జూన్ 29 : గత సంవత్సరం నవంబర్ 8 న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురైన సంగతి తెలిసిందే. అప్పట్లో పాత 500, 1000 రూపాయాల నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త 500, 2000 రూపాయల నోట్లను విడుదల చేసిన ప్రభుత్వం, ప్రస్తుతం ప్రజలకు ఎదురవుతున్న నగదు లావాదేవీల సమస్యను పరిష్కరించడానికి ముందడుగు వేసింది. దీనిలో భాగంగా త్వరలో రూ. 200 ల విలువ కలిగిన నోట్లను అందుబాటులోకి తీసుకురావడానికి భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) సన్నాహాలు చేస్తుంది. మధ్యప్రదేశ్ హోషంగాబాద్ లో ఉన్న ప్రభుత్వ ముద్రణశాలకు కొన్ని వారాల క్రితమే ఈ నోట్ల ముద్రణ పనిని అప్పగించారు. నకిలివీ సృష్టించకుండా రూ. 200 నోట్లలో అదనపు భద్రత ప్రమాణాలు చేర్చడమే కాకుండా, వీటిని వివిధ కోణాల్లో అధికారులు తనిఖీ చేస్తున్నారు. నోట్లను రద్దు చేసే సమయంలో 1,650 లక్షల కోట్ల నోట్లు చలామణీలో ఉన్నాయని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పరిశోధన చెబుతోంది. ఇవన్నీ చెల్లకుండా పోవడంతో పెద్ద లోటు ఏర్పడింది. డీమానిటైజేషన్‌ సమయానికి పాత రూ.500, రూ.1000 నోట్లు అందుబాటులో ఉన్న కరెన్సీలో 86 శాతం (రూ.17.9 లక్షల కోట్లు) ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌ 9 నాటికి చలామణీలో ఉన్న కరెన్సీ రూ.14.6 లక్షల కోట్లు. డీమానిటైజేషన్‌ ముందు ఉన్న దాని కంటే 18.4 శాతం తక్కువ ఉందట. ఈ లోటును రూ.200 ల నోట్లతో భర్తీ చేస్తారని బ్యాంకు వర్గాలు అంచనా వేస్తున్నాయి. రద్దు చేసిన నోట్ల స్థానంలో కొత్త నోట్ల భర్తీ ప్రక్రియ దాదాపు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో సరికొత్త విలువైన నోటును తొలి సారిగా ప్రవేశపెడుతున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. రూ.100- రూ.500 ల మధ్య ఇలాంటి నోట్లు రావడం వల్ల రోజువారీ నగదు పనులు సులభంగా జరుగుతాయని బ్యాంకుల అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.