మహిళా విలేకరిపై మంత్రి వ్యాఖ్యలు

SMTV Desk 2018-03-17 12:12:17  TN health minister, vijaya bhaskar, controversy,

చెన్నై, మార్చి 17: తమిళనాడు ఆరోగ్యమంత్రి సి.విజయభాస్కర్‌ మహిళా విలేకరిపై చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. అన్నాడీఎంకే పార్టీ గురువారం నిర్వహించిన సమావేశానికి హాజరైన విజయభాస్కర్‌ బయటికొస్తుండగా.. భేటీలో తీసుకున్న నిర్ణయాల విషయమై ఓ మహిళా జర్నలిస్ట్‌ ఆయనను ప్రశ్నించారు. దీంతో ప్రశ్నల్ని తప్పించుకునేందుకు ‘మేడమ్‌ మీరు కళ్లద్దాల్లో చాలా అందంగా ఉన్నారు’ అని విజయభాస్కర్‌ వ్యాఖ్యానించారు. తానెప్పుడూ కళ్లద్దాలు ధరిస్తానన్న ఆమె సమావేశంలో పార్టీ నిర్ణయాలపై మళ్లీ మంత్రిని ప్రశ్నించింది. దీంతో విజయభాస్కర్‌ ‘మీరు ఈరోజు చాలా అందంగా ఉన్నారు’ అని జవాబిచ్చారు. మహిళా జర్నలిస్టు పై మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో విజయభాస్కర్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రశ్నల్ని తప్పించుకునేందుకే అలా అన్నట్లు వివరించారు. నా వ్యాఖ్యలు ఆమెను బాధపెట్టి ఉంటే క్షమాపణలు కోరుతున్నానన్నారు.