రచ్చో.. రచ్చస్యో.. రచ్చభ్యః..

SMTV Desk 2018-03-17 11:59:08  srilanka vs bangladesh, shakib al hasan, srilanka, nidahas trophy

కొలంబో, మార్చి 17 ; ఆటలో గెలుపు, ఓటములు సహజం..వాటితో పాటు ఆశ, నిరాశ, పోటీ, ఆలోచనలు, ఇలా చాలా ఉంటాయి. ముఖ్యంగా ప్రతి వ్యక్తి ఆడుతున్న ఆటలో ఎంత క్రీడాస్ఫూర్తి చూపిస్తున్నాడో అనేది లెక్కలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. నిన్న నిదహాస్ ట్రోఫీ లో భాగంగా శ్రీలంక- బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు చేసిన రచ్చ ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. ముఖ్యంగా ఆ దేశ సారథి షకిబ్‌ అల్‌ హసన్‌ అతిగా ప్రవర్తించడమే అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. నిబంధనల ప్రకారం ఒక ఓవర్లో ఒక బౌన్సర్‌ వేసుకోవచ్చు. కానీ తర్వాత బంతిని కూడా ఉదాన భుజానికంటే ఎత్తుగా వేసినా, నోబాల్‌ ఇవ్వకపోవడం గురించే బంగ్లా ఆక్షేపించింది. నిబంధనల ప్రకారం ఈ విషయాన్ని మైదానంలో ఉన్న బ్యాట్స్‌మెన్‌ అంపైర్‌కు ఫిర్యాదు చేయాలి. కానీ మైదానం బయట ఉన్న సారథి అత్యుత్సాహాన్ని ప్రదర్శించి తమ ఆటగాళ్లను ఆడొద్దు వచ్చేయమనడమే సబబుగా లేదు. గెలవాలన్న తపన ఉండటం సహజం. కానీ దానికోసం విచక్షణ మరిచి ప్రవర్తించడం క్రీడాస్ఫూర్తిని తుంగలోతోక్కడమే అవుతుంది. అంతేకాకుండా మ్యాచ్‌ ముగిసిన తర్వాత లంకను రెచ్చగొట్టేరీతిలో బంగ్లా ప్లేయర్లు నాగిని డ్యాన్సులు చేశారు. బంగ్లా కెప్టెన్‌ షకిబుల్‌ చొక్కా విప్పేసి మైదానంలోకి వచ్చి గంతులేశాడు. మ్యాచ్‌ పూర్తైన తర్వాత బంగ్లా డ్రెస్సింగ్‌ రూమ్‌ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై ప్రేమదాస స్టేడియం సిబ్బంది, లంక బోర్డుకు ఫిర్యాదుచేశారు. శుక్రవారం మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేయగా, మహ్మదుల్లా మెరుపులతో లక్ష్యాన్ని బంగ్లా 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి చేధించిన విషయం తెలిసిందే.