లంకను గెలిచేశారు..

SMTV Desk 2018-03-17 10:54:47  srilanka vs bangladesh, nidahas trophy, bangladesh, srilanka

కొలంబో, మార్చి 17 : సొంత గడ్డపై శ్రీలంక జట్టుకు పరాభవం.. గెలవాల్సిన మ్యాచ్ ను బంగ్లాదేశ్ జట్టు చేతిలో అనూహ్యరీతిలో ఓటమి పాలయ్యింది. నిదహాస్ ట్రోఫీలో భాగంగా శ్రీలంక- బంగ్లాదేశ్ మధ్య జరిగిన తుది పోరు రణరంగంల తలపించింది. ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య సాగిన ఈ మ్యాచ్ లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మహ్మదుల్లా (43) వీరోచిత ఇన్నింగ్స్ తో బంగ్లాకు విజయాన్ని అందించాడు. ముఖ్యంగా చివరి ఓవర్లో ఒక వైపు ఉత్కంఠ, ఊహించిన మలుపులు, మరో వైపు ఇరు జట్ల మధ్య వాగ్వాదాలు వెరసి మ్యాచ్ ముగింపు మాత్రం అభిమానులు ఎప్పటికి మర్చిపోలేని ఘట్టం. తొలుత టాస్ నెగ్గిన బంగ్లా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన ప్రత్యర్ధి జట్టులో మొదట 9 ఓవర్లలో 43 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. అనంతరం లంకను కుశాల్‌ పెరీరా (61), తిసార పెరీరా (58) తమ బ్యాటింగ్ తో ఆదుకున్నారు. దీంతో ఆతిధ్య జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159పరుగులు చేసింది. తర్వాత లక్ష్య చేధనకు దిగిన బంగ్లా జట్టులో తమీమ్‌ ఇక్బాల్‌ (50 ), ముష్ఫికర్‌ రహీం (28)తో కలిసి లంక బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నారు. ఒక దశలో 97/2తో విజయం దిశగా సాగిన బంగ్లా, స్వల్ప విరామంలో 4 వికెట్లు చేజార్చుకుని 137/6తో ఓటమి వైపు సాగింది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌ ఆడిన సారథి షకిబ్‌ అల్‌ హసన్‌ (7) నిరాశపరచగా, మెహది హసన్‌ (0) రనౌట్‌ కావడంతో జట్టు కష్టాల్లో పడింది. చివరి ఓవర్ కు 12 పరుగులు చేయాల్సిన తరుణంలో ఇరుజట్ల మధ్య తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దానికి తోడు తొలి వరుస రెండు బంతులు నోబాల్ అని బంగ్లాదేశ్ జట్టు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. ఒక దశలో కెప్టెన్ షకిబ్ ఆటగాళ్లను మైదానంలో నుండి వచ్చేమయని కూడా చెప్పాడు. అంపైర్లు రంగంలోకి దిగి ఆటగాళ్లకు సర్ది చెప్పడంతో మ్యాచ్ కొనసాగింది. అంతా ఒత్తిడిలో కూడా మహ్మదుల్లా మూడో బంతినే బౌండరీ బాది, తర్వాత బంతికి డబుల్ తీసి, ఐదవ బంతిని సిక్స్ గా మలిచి బంగ్లాదేశ్ కు చిరస్మరణీయ విజయం అందించాడు. దీంతో ఒక్కసారిగా మైదానంలోకి దూసుకొచ్చిన బంగ్లా ఆటగాళ్లు నాగిని నృత్యం చేయగా, అనుకోని ఓటమితో లంక ఆటగాళ్లు, అభిమానులు నిరుత్సాహంలో మునిగిపోయారు. భారత్-బంగ్లాదేశ్ జట్టు ఆదివారం ఫైనల్ లో తలపడనున్నాయి.