సీఓఏకి చేరిన షమి ఎఫ్‌ఐఆర్‌..

SMTV Desk 2018-03-16 13:36:01  Mohammed Shami, shami complaints copy, hasin jahan, indian crickter

కోల్‌కతా, మార్చి 16 : టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్‌ షమిపై ఆయన భార్య చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో అతనితోపాటు, మరో నలుగురు సభ్యులపై పోలీసులు గృహహింస, హత్యాయత్నంతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద పాటు కేసులు నమోదు చేశారు. తాజాగా హసీన్‌ పోలీస్‌స్టేషన్లో షమిపై తాను చేసిన ఫిర్యాదుకు సంబంధించిన కాపీని బీసీసీఐకి పంపినట్లు ఆమె తరఫు న్యాయవాది జకీర్‌ హుస్సేన్‌ వెల్లడించారు. ‘గురువారం కోల్‌కతా పోలీస్‌ స్టేషన్లో షమిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన కాపీని సీఓఏ (కమిటీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటర్స్‌ ) ఛైర్మన్‌ వినోద్‌ రాయ్‌కి పంపించాం’ అని జకీర్‌ చెప్పారు. ఒక మ్యాచ్‌ కు సంబంధించిన విషయంపై ఫిక్సింగ్ చేసేందుకు పాకిస్థాన్‌ అమ్మాయి ద్వారా షమి డబ్బు తీసుకున్నట్లు అతని భార్య హసీన్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై దృష్టి సారించిన సీఓఏ దీనిపై విచారణ జరిపి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం ఛైర్మన్‌ నీరజ్‌ కుమార్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే జకీర్‌ ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన కాపీని పంపినట్లు సమాచారం. హసీన్‌ తనపై చేసిన మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపై షమి మాట్లాడుతూ.. ‘విచారణలో తాను ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు రుజవైతే ఉరి తీయండి’ అని భావోద్వేగంగా చెప్పాడు.