లోకేష్‌ అవినీతి కనిపించడం లేదా? : పవన్

SMTV Desk 2018-03-15 11:16:41  janasena formation day, pawan kalyan, tdp,

గుంటూరు, మార్చి 15 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర౦ తీరుపై, కేంద్ర౦ వైఖరిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్ష వైకాపాకు చురకలంటించారు. వామపక్షాలతో కలిసి క్రియాశీల రాజకీయాలు చేస్తామని సంకేతాలు పంపారు. ఈ మేరకు గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న స్థలంలో ఆవిర్భావ వేడుకలో జనసేన అధ్యక్షుడు పవన్.. రాజకీయ కార్యాచరణ ప్రకటించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలన్నారు. అందుకు అవసరమైతే ఆమరణ నిరాహారదీక్షకి సైతం సిద్ధం అన్నారు. ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తే సహించేది లేదని కేంద్రాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెదేపా ప్రభుత్వం ప్రజల నమ్మకం కోల్పోయింది. ప్రజల పక్షాన అండగా ఉండాల్సిందిపోయి.. వారికి ద్రోహం చేసింది. ఇక నుండి ప్రతి రోజూ తెదేపా వైఫల్యాల్ని, తప్పుల్ని నిలదీస్తామన్నారు. తెదేపాకు మద్దతిచ్చింది ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణానికే తప్ప.. ఆ పార్టీ పునర్నిర్మాణానికి కాదన్నారు. చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ పై అవినీతి ఆరోపణలు చేశారు. లోకేష్ అవినీతి చంద్రబాబుకు తెలీదా.? ఆంధ్రప్రదేశ్‌ను అవినీతిమయం చేశారు. ఎన్ని ఎకరాలు కావాలి? ఎన్ని కోట్లు కావాలి. ఎన్టీరామారావు రూ.2 కే బియ్యం ఇస్తే ఆయన మనుమళ్లు ఏం చేస్తున్నారు. జగన్‌ను ఎదుర్కోవాలంటే అవినీతి చేసుకోవాలంటున్నారు. అంటూ లోకేష్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు.