ఫైనల్లోకి భారత్.. బంగ్లాపై విజయం..

SMTV Desk 2018-03-15 11:03:23  india vs bangladesh, india, rohith sharma, bangladesh

కొలంబో, మార్చి 15 : చాలా రోజులుగా రోహిత్ శర్మ ఫామ్ పై టీమిండియా క్రీడాభిమానులు ఆందోళన చెందుతున్నారు. భారత్ జట్టు గెలిచినా అభిమానుల్లో ఎక్కడో చిన్న వెలితి.. రోహిత్ శర్మ సొగసైన ఆట చూడలేకపోతున్నామని.. ఆ ఆశ నిన్నటి మ్యాచ్ తో తీరిపోయింది. శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు టీ-20 ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో సారధి రోహిత్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తనదైన శైలిలో రెచ్చిపోయిన హిట్ మ్యాన్ (89) పరుగులతో ఆకట్టుకొనే ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు యువ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ (3/22) రాణించడంతో టీమిండియా జట్టు బంగ్లాదేశ్‌ను 17 పరుగులతో ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలుత టాస్ నెగ్గిన బంగ్లా జట్టు టీమిండియాకు బ్యాటింగ్ అప్పగించింది. బ్యాటింగ్ లో రోహిత్ తో పాటు రైనా (47), ధావన్ (30) కూడా రాణించారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఒక దశలో రోహిత్ శర్మ శతకం సాధించేలా కనిపించిన రుబెల్ వేసిన ఆఖరి ఓవర్ చివరి బంతికి రన్ అవుట్ గా వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ప్రత్యర్ధి జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులే చేయగలిగింది. టీమిండియా బౌలర్లలో యువతేజం వాషింగ్టన్ సుందర్ తన స్పిన్ మాయజాలంతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. శ్రీలంక మ్యాచ్ లో చెలరేగి ఆడి గెలిపించిన ముష్ఫికర్‌ రహీమ్‌ (72 నాటౌట్‌) మరోమారు పోరాడిన సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోవడంతో జట్టును గెలిపించాలేకపోయాడు. రోహిత్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు. కాగా టీమ్‌ఇండియా ఫైనల్‌ ప్రత్యర్థి ఎవరనేది శుక్రవారం శ్రీలంక-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ ఫలితంతో తేలనుంది.