నేడు బంగ్లాతో భారత్ ఢీ..

SMTV Desk 2018-03-14 11:28:58  india vs bangladesh, srilanka, rohith sharma

కొలంబో, మార్చి 14 : శ్రీలంకతో తొలి పరాజయం తర్వాత కోలుకున్న టీమిండియా క్రికెట్ జట్టు ఇప్పుడు బంగ్లాదేశ్ ను ఢీకొట్టనుంది. ముక్కోణపు టీ-20 ట్రోఫీలో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్ ల్లో నెగ్గిన రోహిత్ సేన ఫైనల్ కు చేరడం దాదాపు ఖాయం అయినట్లే! కాకపోతే ఈ రోజు జరిగే మ్యాచ్ లో గెలిస్తే ఎటువంటి సమీకరణలతో సంబంధం లేకుండా తుది పోరులో నిలుస్తుంది. భారత్ జట్టు పరంగా కుర్రాళ్లు రాణిస్తున్నారు. ముఖ్యంగా సారథి రోహిత్ శర్మ ఫామ్ టీంను చాలా ఆందోళనకు గురి చేస్తుంది. ఒక వైపు ధావన్ టోర్నీ లో అద్భుతంగా ఆడుతుండగా, మిడిల్ ఆర్డర్ లో రైనా, పాండే, కార్తీక్ తమ బాధ్యతను నెరవేరుస్తున్నారు. మరో వైపు బౌలింగ్ లో పేసర్ ఉనద్కత్ వికెట్లు తీసినప్పటికీ ధారాళంగా పరుగులు సమర్పిస్తున్నాడు. శార్దుల్ ఠాకూర్, అల్ రౌండర్ విజయ్ శంకర్ పొదుపుగా బౌలింగ్ చేస్తున్నారు. స్పిన్ విభాగంలో చాహల్, వాషింగ్టన్ సుందర్ మంచి ప్రదర్శన చేస్తున్నారు. టీమిండియా చేతిలో పరాభవం తర్వాత బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో చెలరేగి ఆడి భారీ లక్ష్యాన్ని ఛేదించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎప్పుడు ఎలా ఆడతారో తెలియని బంగ్లా జట్టును నిలువరించాలంటే రోహిత్ సేన పక్క ప్రణాళికలతో బరిలోకి దిగాలి. బ్యాటింగ్ లో తమీమ్‌ ఇక్బాల్, సౌమ్య సర్కార్, లిటన్‌దాస్, ముష్ఫికర్‌ రహీమ్‌ ను తొందరగా పెవిలియన్ కు పంపితే టీమిండియా కు విజయావకాశాలు మెండుగా ఉంటాయి. గతంలో భారత్ నెగ్గిన రెండు మ్యాచ్ లు లో బౌలింగ్ పాత్ర మరిచిపోలేనిది. మరి ఈ సారీ టీమిండియా బౌలర్లు బంగ్లా ను ఏ మేరకు నిలువరిస్తారో చూడాలి..!