పోటీతత్వం వల్లే దేశాలు అభివృద్ది : మోదీ

SMTV Desk 2018-03-10 12:29:32  pm, modhi, developmen, countries

న్యూఢిల్లీ, మార్చి 10 : పోటీతత్వం వల్లే రాష్ట్రాలు, దేశాలు అభివృద్ధి సాధిస్తాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.. రాష్ట్రాల మాదిరిగానే దేశాల మధ్య కూడా పోటీ ఉంటుందని తెలిపారు. ఢిల్లీ వేదికగా జాతీయ ప్రజాప్రతినిధుల సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, ప్రజాప్రతినిధుల బాధ్యతలపై ప్రసంగించారు. సాధారణంగా ఒక విద్యార్థి ఒక విషయంలో బాగా రాణించినా మరో విషయంలో వెనుకబడిపోవచ్చు. అలాగే రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలు కూడా ఒకేలా ఉండవు. కొన్ని అభివృద్ధి చెంది ఉంటాయి. మరికొన్ని వెనుకబడిపోయి ఉంటాయి. వెనుకబడిన జిల్లాలు తమ లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. దేశంలో అభివృద్ధి చెందిన జిల్లాతో పోలిస్తే మనం ఎక్కడున్నామో గమనించాలి. తదనుగుణంగా ప్రణాళిక రచించుకోవాలి. ఇందులో జిల్లా కలెక్టర్ల పాత్ర కీలకం. కలెక్టర్లు ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లాలతో పోల్చుకోవాలి. అక్కడ అనుసరిస్తున్న విధానాలను పరిశీలించాలి. ఇందుకు కలెక్టర్లకు నాయకులు, ప్రజల భాగస్వామ్యం అవసరమని మోదీ అన్నారు.