వీడియోతో రాహుల్‌కు చిక్కులు..

SMTV Desk 2018-03-09 14:42:16  singapur, rahul, vedeo, creat, problem

న్యూఢిల్లీ, మార్చి 9: సింగపూర్‌లోని లీ కుయాన్‌ యూ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీలో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్‌ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది. అయితే ఈ వీడియో కారణంగా రాహుల్‌గాంధీ చిక్కుల్లో పడ్డారు. వీడియోలో చూపించిన విధంగా ముఖాముఖి జరగలేదని ‘ఏషియా రీబార్న్‌’ పుస్తక రచయిత ప్రసంజిత్‌ కే బసు ఆరోపించారు. వీడియో వెంటనే తొలగించాలని.. లేదంటే కాంగ్రెస్‌పై దావా వేస్తానని హెచ్చరించారు. కాంగ్రెస్‌ పోస్టు చేసిన వీడియోలో ఏముందంటే.. “వీడియోలో ప్రసంజిత్‌ బసు మాట్లాడుతూ.. భారత్‌లో కాంగ్రెస్‌ పాలనపై రాహుల్‌ను ప్రశ్నించారు. ‘మీ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు దేశ తలసరి ఆదాయం.. ప్రపంచ దేశాల తలసరి ఆదాయం సగటు కన్నా తక్కువగా ఉండేది. మీ కుటుంబం అధికారం నుంచి తప్పుకోగానే ఆదాయం ఒక్కసారిగా పెరిగింది. దీనికి కారణం ఏంటీ?’ అని బసు ప్రశ్నించారు. ఆ వెంటనే మరో వ్యక్తి నిలబడి కాంగ్రెస్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘నేను జవహార్‌లాల్‌ నెహ్రూ గారికి చాలా పెద్ద అభిమానిని. భారత్‌ ఇంతటి అభివృద్ధి సాధించడానికి కాంగ్రెస్‌ పార్టీనే కారణం’” అంటూ ఆ వ్యక్తి తెగ పొగిడేశారు.