కారుణ్య మరణానికి సుప్రీం ఓకే..

SMTV Desk 2018-03-09 12:34:07  supreme, court, judgement, patients

న్యూఢిల్లీ, మార్చి 9 : ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న రోగుల ‘సజీవ వీలునామా’ను పరిగణనలోకి తీసుకుని పరోక్ష కారుణ్య మరణాన్ని ప్రసాదించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెల్లడించింది. పరోక్ష కారుణ్య మరణాలు, వాటి కోసం పరిగణించే సజీవ వీలునామా అనుమతించదగినవేనని స్పష్టం చేసింది. అయితే ఇలాంటి కేసుల్లో సజీవ వీలునామాను పరిగణనలోకి తీసుకోడానికి కొన్ని కఠిన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ కేసులపై చట్టాన్ని తీసుకొచ్చేంతవరకు ఈ మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం నేడు తీర్పు వెలువరించింది. వైద్యంతో నయం కాని రోగాలతో బాధపడే రోగులకు ఆ బాధల నుంచి విముక్తి కల్పించేందుకు పరోక్ష కారుణ్య మరణాలను ప్రసాదించాలని కామన్‌ కాస్‌ అనే ఎన్జీవో సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఇందుకు సజీవ వీలునామాను పరిగణనలోకి తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. సదరు రోగులు తమకు ఇవ్వాల్సిన చికిత్సపై ముందుగానే సూచనలు జారీ చేసే పత్రాన్ని సజీవ వీలునామాగా పేర్కొంటారు. ఈ పిటిషన్‌పై గతేడాది అక్టోబరు 11నే వాదనలు ముగించిన సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది. తాజాగా నేడు ఈ కేసుపై తీర్పును వెల్లడించింది.