తెదేపా నేతలతో చంద్రబాబు అత్యవసర సమావేశం..

SMTV Desk 2018-03-09 12:00:01  central government, funds, meeting, cm chandrababu

అమరావతి, మార్చి 9: కేంద్ర సాయంతో రాష్ట్రంలో అమలయ్యే ప్రాజెక్టులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. కేంద్ర మంత్రివర్గం నుండి తెలుగుదేశం ఎంపీలు వైదొలిగినందున పార్టీ ముఖ్య నేతలతో తన నివాసంలో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావుతో పాటు మంత్రులు లోకేష్, యనమల, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, పయ్యావుల కేశవ్‌, కుటుంబరావు తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సిన నిధులు.. రాష్ట్ర రాజకీయాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ప్రత్యేక హోదాపై కేంద్రంపై ఒత్తిడి పెంచుతూనే కేంద్ర నిధులు ఏ విధంగా రాబట్టుకోవాలనే కోణంలో ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఉపాధి హామీ బకాయిలకు రాష్ట్ర నిధుల నుంచే చెల్లింపులు జరపాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇదే తరహా ఇబ్బందులు మరిన్ని వస్తే రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో పడుతుందంటూ ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో సీఎం సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.