ఈశాన్య పవనాలు బీజేపీ వైపే...

SMTV Desk 2018-03-03 13:15:01  tripura, nagaland, meghalaya, election result

షిల్లాంగ్‌/కోహిమా/అగర్తలా, మార్చి 3 : ఈశాన్య భారతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ రెండు రాష్ట్రాల్లో ముందంజలో ఉంది. ఇటీవల త్రిపుర, మేఘాలయా, నాగాలాండ్‌ లో జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. త్రిపుర, నాగాలాండ్‌లలో భాజపా కూటమి అధిక్యంలో ఉండగా, మరో రాష్ట్రం మేఘాలయలో కాంగ్రెస్‌ లీడ్ లో కొనసాగుతున్న ఫలితాలు సంకీర్ణం దిశగా సాగుతున్నాయి. త్రిపురలో కమలం వికాసం.. గత 25 ఏళ్లుగా వామపక్షాలకు కంచుకోట అయిన త్రిపురలో ఆ కూటమికి ఈ సారి కమలం పార్టీ గట్టి పోటీనిచ్చింది. తొలి గంటల్లో వామపక్షాలు ముందంజలో ఉన్న ఆ తర్వాత ఫలితాలలో అనూహ్యంగా భాజపా ముందంజలోకి రావడమే కాకుండా, స్పష్టమైన ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. ప్రస్తుతం త్రిపురలో కాషాయ కూటమి 40కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సీపీఎం కూటమి 19 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఖాతాను తెరవలేదు. నాగాలాండ్ మాదే.. నాగాలాండ్ రాష్ట్రంలో అధికార ఎన్‌పీఎఫ్‌ను వెనక్కినెట్టి.. భాజపా కూటమి పార్టీ అయిన ఎన్డీపీపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. ఇప్పటికే రెండు స్థానాల్లో గెలుపొందిన ఎన్డీపీపీ మరో 28 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎన్‌పీఎఫ్‌ కూటమి 24 స్థానాల్లో లీడ్ లో ఉంది. సంకీర్ణం దిశగా మేఘాలయ.. మేఘాలయలో ప్రస్తుతం ఏ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సంపాదించలేదు. దీంతో ఇక్కడ హంగ్‌ ఏర్పడే అవకాశాలున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఖాతా తెరవని కాంగ్రెస్‌ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే ఈ రాష్ట్రంలోనూ కమల దళంకు విజయావశాకాలు కన్పిస్తున్నాయి.