ప్రజా భాషలో మాట్లాడితే తప్పేంటి.? : కేటీఆర్

SMTV Desk 2018-03-03 11:24:41  minister ktr, comments on congres party, cm kcr, hyderabad.

హైదరాబాద్, మార్చి 3 : "ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటనలు చేస్తుంటే విపక్షాలకు ఏమి తోచడం లేదు అందుకే ఇలా విమర్శలు చేస్తున్నారు" అంటూ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జానారెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. ప్రజా భాషలో మాట్లాడితే తప్పుపట్టడం ఏంటని సూటిగా ప్రశ్నించారు. "సూటూ, బూటు వేసుకుంటే అమెరికా భాష అంటారు. ప్రజల భాషలో మాట్లాడితే తప్పంటారు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ ముఖ్యమంత్రి జిల్లాల్లో పర్యటించడం లేదంటూ విపక్షనేతలు పలు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సీఎం జిల్లాల పర్యటనలు చేస్తుంటే ఏమి చేయాలో వారికి పాలుపోవడం లేదంటూ దుయ్యబట్టారు. ఉన్నమాటే అంటే ఉలుకెక్కువ అన్నట్లు కాంగ్రెస్ నేతల గురించి నేను పూర్తి వాస్తవాలే మాట్లాడానన్నారు. ఇంకోసారి తనను ఉద్దేశించి బచ్చా అంటే ధీటైన సమాధానం చెప్తాన౦టూ పేర్కొన్నారు.