పరారీ నేరగాళ్లపై ఉక్కుపాదం...

SMTV Desk 2018-03-02 15:36:38  approves Fugitive Economic Offenders bill, anur jaitley, NFRA, central cabinate

న్యూఢిల్లీ, మార్చి 2 : నీరవ్‌ మోదీ, విజయ్‌ మాల్యాలా బ్యాంకుల నుండి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని వాటిని చెల్లించకుండా బ్యాంకులను నిలువునా ముంచే మాయగాళ్ల ఆగడాలకు కేంద్రం చెక్ పెట్టనుంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్‌ భారీ మొత్తంలో రుణాలు తీసుకుని చెల్లించని వారి పై ఉక్కుపాదం మోపేందుకు పరారీ నేరగాళ్ల బిల్లుకు ఆమోదముద్ర వేసింది. దీంతో వారి ఆస్తులను ఎలాంటి అనుమతులతో పని లేకుండా స్వాధీనం చేసుకునేందుకు మార్గం సులభతరం కానుంది. ఇలాంటి మోసగాళ్లు బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిలన్నింటినీ రికవరీ చేయడమే ఈ బిల్లు లక్ష్యం. 100 కోట్ల రూపాయల వరకు రుణ బకాయిలు ఉండి దేశం వదిలి పరారైన మోసకారులందరికీ ఇది వర్తిస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. తప్పుడు కంపెనీలకు అండగా నిలిచే ఆడిటర్ల పనిపట్టడమే లక్ష్యంగా జాతీయ ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ అధారిటీ ఏర్పాటుకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అక్రమ పనులకు పాల్పడే ఆడిటర్లు, ఆడిటింగ్‌ సంస్థలపై చర్యలు తీసుకునేందుకు సంపూర్ణ అధికారాలు ఎన్‌ఎ్‌ఫఆర్‌ఏకి ఉంటాయి. ఇది సంపూర్ణ సర్వస్వతంత్ర సంస్థగా వ్యవహరిస్తుంది. ఈ వ్యవస్థ ఏర్పాటయినట్టయితే తప్పుడు కార్యకలాపాలకు పాల్పడే ఆడిటర్లపై ప్రస్తుతం ఐసిఏఐకి గల అధికారాలన్నీ దానికి బదిలీ అవుతాయి.