బీజేపీ కూటమికి మాంఝీ రా౦..రా౦..

SMTV Desk 2018-02-28 16:30:55  ham party, jdu, jitan ram manjhi, bihar

పాట్నా, ఫిబ్రవరి 28 : భారతీయ జనతా పార్టీకి బీహార్ లో ఎదురుదెబ్బ తగిలింది. హిందుస్తాన్‌ ఆవామ్‌ మోర్చా పార్టీ అధ్యక్షుడు, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి జీతన్‌ రామ్‌ మాంఝీ బీజేపీ కూటమికి రా౦..రా౦.. చెప్పేశారు. బిహాన్‌ ప్రతిపక్షనేత, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తనయుడు తేజస్వీ యాదవ్‌ పట్నాలోని మాంఝీ నివాసానికి వచ్చి కాసేపు భేటీ అయ్యారు. ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమిలో ఆయన చేరనున్నారు. మాంఝీ చేరికపై నేటి సాయంత్రం అధికారికంగా తెలుపుతారని పేర్కొన్నారు. ఒకప్పుడు సీఎం పదవిని కాపాడుకునేందుకు సొంత పార్టీ జేడీయూను ధిక్కరించి బీజేపీతో జతకట్టిన మాంఝీ.. తర్వాతి కాలంలో సొంతగా పార్టీ స్థాపించి ఎన్నికల్లో దెబ్బతిన్నారు. రాజకీయంగా దాదాపు కనుమరుగయ్యే పరిస్థితుల్లో.. తన కుమారుడు ప్రవీణ్‌ మాంఝీని నాయకుడిగా నిలబెట్టాలని జీతన్‌ రామ్‌ భావిస్తున్నారు. జెహానాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరుగనున్న ఉప ఎన్నికలో ఎన్డీఏ తరఫున తన కుమారుడిని బరిలోకి దించాలని ప్రయత్నించారు. కానీ ఆ స్థానంలో జేడీయూ తన అభ్యర్థిని ఇప్పటికే ఖరారు చేసింది. దీంతో అసంతృప్తి చెందిన మాంఝీ ఏకంగా ఎన్డీఏ నుంచి వైదొలిగారు.