నాగాలాండ్, మేఘాలయలో సాఫీగా సాగుతున్న పోలింగ్..

SMTV Desk 2018-02-27 10:43:18  nagaland, meghalaya, assembly elections, bjp

నాగాలాండ్, ఫిబ్రవరి 27 : ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్‌లో ఉదయం 7.00 గంటలకు శాసనసభ ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది. పోలింగ్ కేంద్రాలకు ఓటు వేసేందుకు వచ్చే అభ్యర్ధులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు వెల్లడించారు. కొన్ని పోలింగ్‌ కేంద్రాలు మినహా మిగతా అన్ని చోట్లా సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. రెండు రాష్ర్టాల్లోనూ చెరో 60 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. కాగా 2 రాష్ర్టాల్లోనూ 59 సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మేఘాలయలో విలియమ్‌ నగర్‌ ప్రాంతంలో తీవ్రవాదుల దాడిలో ఎన్సీపీ అభ్యర్థి జోనాథన్‌ ఎన్‌ సంగ్మా మరణించడంతో అక్కడ ఎన్నిక నిలిపివేశారు. ఇక నాగాలాండ్‌లో ఎన్డీపీపీ చీఫ్‌ నెఫ్యూ రియో ఉత్తర అంగామి–2 నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికవడంతో ఆ స్థానంలో ఎన్నిక జరగట్లేదు. ఈ ఎన్నికలను కమలం, హస్తం పార్టీలు చాలా ప్రతిష్టాత్మక౦గా తీసుకున్నాయి. మేఘాలయ, నాగాలాండ్‌ సహా ఇప్పటికే ఎన్నికలు ముగిసిన త్రిపుర రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను మార్చి 3న వెల్లడిస్తారు.