ఆమెకు నేను వీరాభిమానిని : స్మృతి ఇరానీ

SMTV Desk 2018-02-26 15:46:21  minister smruthi irani, letter, for sridevi, mumbai.

ముంబై, ఫిబ్రవరి 26 : శ్రీదేవి హఠాన్మరణం విని అటు చలనచిత్ర పరిశ్రమ, ఇటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ శ్రీదేవిని తలుచుకుంటూ ఒక భావోద్వేగపు లేఖ రాశారు. తనను శ్రీదేవిని ఎంత ప్రభావితం చేసిందో తెలుపుతూ.. తన అంతరంగ౦లో ఉన్న బాధకు అక్షర రూపం దాల్చారు. ఆ లేఖలో.. "శ్రీదేవి ఎక్కడుంటే ఆ ప్రాంతమంతా చాలా సరదాగా, ఆనందంగా ఉంటుంది. గతేడాది గోవాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవ కార్యక్రమంలో ఆమెను కలిశాను. ఆమెను కలవడం అదే ఆఖరిసారి. సినీ రంగానికి తను చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ ధన్యవాదాలు చెప్పాను. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ ఉంటాను అంటూ శ్రీదేవి అన్న మాటలు నా చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. అందం ఉంది కాని కొంచెం కూడా అహంకారం లేని మనిషి. ఆమెకు చాలా పెద్ద వీరాభిమానిని నేను. జీవితంలో ఎదురయ్యే ఆటంకాలన్ని ఎదుర్కోగల సత్తా ఉన్న ఆమె చాలా స్టార్‌డమ్‌ తెచ్చుకుంది. తన హావాభావాలతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేస్తూ ఎలాంటి జోనర్ లో అయినా యిట్టె ఇమిడిపోయి నటించగలదు" అని పేర్కొన్నారు.