ఆమె అకాల మ‌ర‌ణం ఎంత‌గానో బాధించింది : రాష్ట్రపతి

SMTV Desk 2018-02-25 12:51:20  PRESIDENT, PM, TS CM, KTR, CONDOLENCE TO SRIDEVI

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 : అతిలోక‌ సుంద‌రిగా ప్రేక్ష‌కుల మ‌న‌సులో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న శ్రీదేవి హ‌ఠాన్మ‌ర‌ణం.. భారతీయ సినీ పరిశ్రమను శోక‌సంద్రంలో ప‌డేసింది. ఆమె అకాల మరణం కోట్లాది అభిమానుల గుండెలు పగిలేలా చేసింది. ఇటు సినీ ప‌రిశ్ర‌మ‌ను, అటు అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె మృతి పట్ల పలువురు తమ సానుభూతిని వ్యక్తం చేశారు. * శ్రీదేవి మరణ వార్తను నమ్మలేకపోతున్నాను. వారి కుటుంబానికి నా సానుభూతి తెలియ‌జేస్తున్నాను. ఆమె అకాల మ‌ర‌ణం త‌న‌ని ఎంత‌గానో బాధించింది - రాష్ట్రపతి కోవింద్ * నటి శ్రీదేవి మరణం బాధాకరం. ఎన్నో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన దిగ్గజ నటి. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. - ప్రధాని మోదీ * శ్రీదేవి మృతిపై నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను - గవర్నర్ నరసింహన్ * నటి శ్రీదేవి మరణం భారతీయ సినీ పరిశ్రమకు, తెలుగు సినిమా అభిమానులకు తీరని లోటు. తెలుగు, హిందీతో పాటు పలు భారతీయ భాషల సినిమాల్లో నటించిన శ్రీదేవి.. తన అందం, నటన, నృత్యాలతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి - సీఎం కేసీఆర్ * నటి శ్రీదేవి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. రెండేళ్ల క్రితం టెక్ స్టార్టప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.తన వినయం నన్ను ఎంతో ఆకట్టుకుంది - మంత్రి కేటీఆర్