ఈ నెల 26న సీఎం కేసీఆర్ కంటి ఆపరేషన్?

SMTV Desk 2017-06-25 17:55:41  telangana cm kcr eye Operation, this month 26th , delhi, Right layer of the eye

హైదరాబాద్, జూన్ 25 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (కేసీఆర్‌)కు సోమవారం డాక్టర్లు కంటి ఆపరేషన్‌ నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నకేసీఆర్‌ మూడు రోజులుగా అధికార నివాసమైన 23, తుగ్లక్‌ రోడ్డుకు వచ్చి చుక్కల మందు వేస్తున్నారు. కుడి కంటిపై పొర ఏర్పడడంతో ఈ మధ్య కాలంలో సీఎం చూపు కాస్త మందగించింది. దాన్ని తొలగించడానికి ఆపరేషన్‌ చేయనున్నారు. వాస్తవానికి, గత నెలలో ఢిల్లీకి వచ్చినప్పుడే ఆయన ఆపరేషన్‌ చేయించుకోవాలని అనుకున్నారు. ఆపరేషన్‌ అవసరమా లేదా మందులతో తగ్గిపోతుందా అన్న సందేహంతో డాక్టర్లు ఆపరేషన్‌ వాయిదా వేశారు. తాజాగా పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు శస్త్ర చికిత్స నిర్వహిస్తే ఉత్తమమని సూచించినట్లు తెలిసింది. దాంతో కేసీఆర్‌ కూడా ఆపరేషన్‌కు అంగీకరించినట్లు డాక్టర్లు వెల్లడించారు. కేసీఆర్‌ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీకి చెందిన కంటి డాక్టర్‌ సచ్‌దేవ్‌ ఆయనకు ఆపరేషన్‌ చేశారు. ఇప్పుడు కూడా ఆయనే చేస్తారని తెలిసింది. ఆపరేషన్‌ తర్వాత రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకుంటారు. నెలాఖరు వరకు సీఎం ఢిల్లీలోనే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. 30వ తేదీన అర్థరాత్రి పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో జరగబోయే జీఎస్టీ అమలు వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. ఆ తర్వాత తిరిగి రాజధానికి రానున్నారు.