రంజాన్ లో విషాదం

SMTV Desk 2017-06-25 14:23:36  Ramzan, Pakistan, Bomb Blast at IG Office, Baloochistan, Qwetta

పెషావర్, జూన్ 25 : రంజాన్ పండుగకు విషాదం చోటు చేసుకుంది. శనివారం పండుగ వాతావరణంలో ఉన్న పాకిస్తాన్ లోని పెషావర్ ఐజీ కార్యాలయం దగ్గర గస్తీ నిర్వహిస్తున్న పోలీసులపై కాల్పులు, బాంబు పేలుళ్లు సంభవించడంతో ఆ ప్రాంతమంతా రక్తంతో నిండిపోయింది. రెండు నగరాలు, ఒక పట్టణంలో జరిగిన ఈ విధ్వంసం కారణంగా దాదాపు 62 మంది చనిపోయారు. వంద మందికి పైగా గాయాలయ్యాయి. షియాలు ఎక్కువగా ఉండే కుర్రమ్ ట్రైబల్ ప్రాంతంలోని పరాచినార్లో పండుగ కోసం వివిధ వస్తువులను, వస్త్రాలను కొనుగోలు చేయడానికి వచ్చిన చాలా మంది తురి మార్కెట్ వద్దకు రావడంతో వారినే లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు జంట పేలుళ్లకు పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో 45 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 75 మంది క్షతగాత్రులుగా మిగిలిపోయారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మరో వైపు బలూచిస్తాన్ ప్రావిన్స్ లో క్వేట్టాలోని ఐజీ కార్యాలయం వద్ద ఆత్మాహుతి దాడిలో ఏడుగురు పోలీసులతో పాటు 13 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 21 మంది గాయపడ్డారు. దీని తర్వాత శనివారం సాయంత్రం కరాచీలోని రోడ్డు పక్కన ఉన్న రెస్టారెంట్ వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖాలకు హెల్మెట్ లు ధరించి అక్కడ ఉన్న పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మరణించారని అక్కడి మీడియా ప్రతినిధులు తెలిపారు. సౌదీ అరేబియాలోని మక్కాలో కూడా జరిగిన ఆత్మాహుతి పేలుడులో గ్రాండ్ మాస్క్ సమీపంలో ఆత్మాహుతి దళసభ్యుడు తనను తాను కాల్చుకున్నాడు. మక్కా వద్ద జరిగిన పేలుడు కుట్రను ముందుగా గుర్తించిన పోలీసులు ఒక ప్లాట్ ను కూల్చి వేసిన సమయంలోనే ఈ సంఘటన చోటు చేసుకుందని, ఆ తర్వాత ఒక మహిళతో సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారని సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ పేర్కొంది.