261 మంది ప్రాణాలు కాపాడిన మహిళా పైలట్..

SMTV Desk 2018-02-12 15:48:24  aeroplane, crashing miss, air india, vistara, mumbai

ముంబయి, ఫిబ్రవరి 12 : గగనతలంలో రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎయిర్‌ ఇండియా, విస్తారా విమానాలు గగనతంలో ఎదురెదురుగా అతి సమీపంలోకి వచ్చాయి. ఓ మహిళా పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో 261 మంది ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... ఫిబ్రవరి 7న రాత్రి 8 గంటల తర్వాత ముంబై నుంచి భోపాల్‌ వెళ్తున్న ఎయిరిండియా ఎయిర్‌బస్‌ ఏ1631, ఢిల్లీ నుంచి పుణే వెళ్తున్న విస్తార యూకే997 ముంబై ఎయిర్‌ స్పేస్‌లో ఎదురెదురుగా వచ్చాయి. ఇరు విమానాలు దగ్గరకు సమీపిస్తున్న తరుణంలో ఆ విమానాల పైలెట్లకు ఆటోమేటిక్‌ వార్నింగ్‌ అలర్ట్‌లు వెళ్లాయి. సెకన్లలో రెండు విమానాలు ఢీకొట్టుకోబోతున్నాయన్న సమయంలో, వెంటనే స్పందించిన ఎయిరిండియా మహిళా పైలెట్‌ అనుపమ కోహ్లి అడ్వయిజరీ ఆదేశాలను పాటిస్తూ... ఎయిర్‌క్రాఫ్ట్‌ను సురక్షితమైన దూరంగా మరలించారు. ఎయిరిండియా ఎయిర్‌క్రాఫ్ట్‌, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సూచనలు పాటిస్తూ వెళ్తోందని, విస్తారా పైలెటే తప్పుడు మార్గంలో విమానాన్ని నడిపినట్టు ఎయిరిండియా అధికారులు ఆరోపించారు. విస్తారా ఎయిర్‌క్రాఫ్ట్‌, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సూచనలకు విరుద్ధంగా ప్రయాణించినట్టు పేర్కొన్నారు. చాకచక్యంగా వ్యవహరించి పెను ప్రమాదాన్ని తప్పించిన అనుపమను పలువురు అభినందిస్తున్నారు.