విరాట్ సేన విజయాలకు బ్రేక్..

SMTV Desk 2018-02-11 11:23:18  india, south africa, won, 4 th odi, dhawan

జోహాన్స్ బర్గ్, ఫిబ్రవరి 11 : వరుస విజయాలతో దూసుకుపోతున్న విరాట్ సేన వేగానికి సౌతాఫ్రికా జట్టు బ్రేక్ వేసింది. ఆరు వన్డేల సిరీస్ లో భాగంగా మూడు వన్డేలు నెగ్గిన టీమిండియా జట్టుకు సఫారీలు షాక్ ఇచ్చారు. పింక్ దుస్తులతో ఇప్పటివరకు ఆపజయం ఎరుగని ప్రోటీస్ జట్టు అదే సేంటిమెంట్ ని కొనసాగించింది. కొత్త చరిత్ర సృష్టించేందుకు ప్రయత్నించిన భారత్ జట్టుకు వాన, వాండరర్స్‌ మైదానం రెండూ సహకరించలేదు. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్ మెన్ లలో శిఖర్ ధావన్(109) శతకంతో అలరించగా, సారథి కోహ్లి (75), ధోని(42) రాణించారు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా జట్టుకు మోస్తరు ఆరంభం లభించింది. ఆమ్లా (33), మార్‌క్రమ్‌ (22) తొలి వికెట్‌కు 43 పరుగులు చేశారు. 8వ ఓవర్లో బుమ్రా మార్‌క్రమ్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని భారత్‌కు తొలి వికెట్‌ అందించాడు. వర్షం కారణంగా మ్యాచ్ లక్ష్యం 28 ఓవర్లలో 202గా మారింది. వర్షం తగ్గిన అనంతరం బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా జట్టులో మిల్లర్‌ (39) , క్లాసెన్‌ (43 నాటౌట్‌), ఫెలుక్‌వాయో ( 23 నాటౌట్‌) లు రాణించడంతో ఆ జట్టు 25.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసి విజయం సాధించింది. భారత ఫీల్డింగ్‌ వైఫల్యాలు, కీలకమైన క్యాచ్‌ల నేలపాలు చేయడం ప్రోటీస్ జట్టుకు కలిసొచ్చింది. భారత బౌలర్లలో కుల్దీప్‌ 2 వికెట్లు తీయగా, చాహల్‌, బూమ్రా, పాండ్యాలు చెరో వికెట్ దక్కించుకున్నారు. సిరీస్ లో భాగంగా ఐదో వన్డే మంగళవారం పోర్ట్‌ ఎలిజబెత్‌లో జరగనుంది.