జూలై 17న పార్లమెంట్ సమావేశాలు

SMTV Desk 2017-06-25 13:10:28  Monsoon session of Parliament, Polling for presidential elections,July 17 to August 11, Union Home Minister Rajnath Singh

న్యూ ఢిల్లీ, జూన్ 25 : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 17 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల ప్రారంభం నాడే రాష్ట్రపతి ఎన్నికలకు పోలింగ్ జరగనున్నట్లు, అలానే జూలై 17 నుంచి ఆగష్టు 11 వరకు ఈ సమావేశాలు నిర్వహించాలని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన శుక్రవారం రాత్రి పార్లమెంటరీ వ్యవహారాల కేబినేట్ కమిటీ సమావేశమై తేదీలను ఖరారు చేశారు. లోక్ సభ సభ్యుడు వినోద్ ఖన్నా, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మృతికారణంగా తొలిరోజు ఉభయ సభలు వాయిదా పడుతాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో గంగానదికి సంబంధించి బిల్లును కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ ప్రవేశపెట్టనుంది. కార్మిక మంత్రిత్వశాఖ సైతం కోడ్ ఆన్ వేజేస్ అనే కనీస వేతన బిల్లును ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం అమలులో ఉన్న కనీస వేతన చట్టం, వేతనాల చెల్లింపు చట్టం తదితర 44 చట్టాలను కుదించి నాలుగు చట్టాలకే పరిమితం చేసే ఉద్దేశంతో ఈ నూతన బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర సామాజిక సంక్షేమ మంత్రిత్వశాఖ బిల్లును దీంతో పాటు బ్యాంకులకు మొండి బకాయిల నియంత్రణకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తున్నది. సాధారణంగా జూలై చివరి వారంలో ప్రారంభం కావాల్సిన సమావేశాలను, రాష్ట్రపతి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందేజరపనున్నట్లు తెలుస్తుంది.