మేడారం.. దుర్గంధమయం..

SMTV Desk 2018-02-06 13:29:24  medaram, sammakka-sarakka jatara, sanitation problem, jaya sankara bhulapalli

మేడారం, ఫిబ్రవరి 6 : "తెలంగాణ కుంభమేళ" గా ప్రసిద్ది చెందిన మేడారం సమ్మక్క -సారలమ్మ మహాజాతర చాలా ఘనంగా ముగిసిన విషయం తెలిసిందే. కాగా ఈ వేడుక అనంతరం భక్తులు వదిలిన వ్యర్థాల వల్ల దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో పరిసరప్రాంతాల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నార్లాపూర్‌, కొత్తూరు, కన్నెపల్లి, కాల్వపల్లి, ఎల్బాక, పడిగాపూర్‌, ఊరట్టం, రెడ్డిగూడెం, వెంగళాపూర్‌, మేడారం, తదితర గ్రామాల్లోని ప్రజలు అంటువ్యాధులు ప్రబలుతాయని భయపడుతున్నారు. నార్లాపూర్‌ చింతల్‌ ఎక్స్‌రోడ్డు, కొండ్రేడు అటవీప్రాంతం, తాడ్వాయి రోడ్డులోని గుడ్డేలుగుగుట్ట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన డంపింగ్‌ యార్డులకు పారిశుధ్య సిబ్బంది చెత్తాచెదారం, వ్యర్థాలను తరలిస్తున్నారు. అవసరమైన మేరకు పారిశుధ్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో శానిటేషన్‌ పనులు ఎప్పుడు పూర్తవుతాయోనని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.