రేపే జోరుగా గోల్కొండ తొలి బోనం

SMTV Desk 2017-06-24 19:26:25  telangana bonalu, golkonda, Ashada Month, 25th sunday

హైదరాబాద్, జూన్ 24 : తెలంగాణ రాష్ట్రంలో ఆషాడ మాసంలో జోరుగా జరిపుకునే తెలంగాణ బోనాల జాతర రేపే గొప్ప ప్రారంభం కానుంది. ఆషాడ మాసమంతా జరుపుకునే ఈ బోనాలకు ఓ విశిష్టత ఉన్నది. బోనాల సంప్రదాయం చరిత్రలో గోల్కొండ బోనాలది ప్రత్యేకమైన స్థానం. తెలంగాణలోని పల్లె పల్లెనా జరుపుకునే ఆషాడ జాతర మొదట గోల్కొండ ఆలయంలోనే ప్రారంభిస్తారు. గోల్కొండలో తొలి బోనం మొదలైన తరువాతనే అన్ని ఆలయాల్లో బోనాల జాతర జరుపుకుంటారు. ఈ జాతర లంగర్ హౌస్ క్రాస్ రోడ్ దగ్గర మొదలై గోల్కొండ కోటకు జోరుగా సాగిపోతుంది. డప్పు దరువుల మోతలు, శివసత్తుల శిగాలు, పోతరాజుల వీరంగాలతో మొదలైన తొట్టెల ఊరేగింపులో కోలాహలంగా కోటవైపుకు సాగేలా దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ తొట్టెల ఊరేగింపు లో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు పాల్గొంటారు.ముఖ్యంగా గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. స్థానిక మహిళలు బోనాలు ఎత్తుకుని అమ్మవారి ఉత్సవ విగ్రహాలను అనుసరిస్తారు. ఈ విధంగా ప్రారంభమైన ఘటోత్సవం ఊరేగింపుగా బాలా హిసారు దర్వాజ గుండా కోటలోని ఆలయానికి చేరుకుంటుంది. ఆషాడం తొలి ఆదివారంతో మొదలై చివరి ఆదివారం దాకా ఈ బోనాలు అన్ని ఆలయాల్లో ఘనంగా జరుపుకుంటారు.