తిరుమల శ్రీవారికి అగ్గి పెట్టె లో పట్టు వస్త్రాలు

SMTV Desk 2017-06-24 17:27:37  Handlooms, Tirupathi, Saree in Match Box, Lord Sri vekateshwara

సిరిసిల్ల, జూన్ 24 : చేనేత వస్త్రాలకు ప్రఖ్యాతిగాంచిన తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్లలో నివసించే నల్ల పరంధాములు కుమారుడైన విజయ్ కుమార్ అనే వ్యక్తి శుక్రవారం రోజున తిరుపతిలో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న సందర్భంగా అమ్మవారికి వినూత్నంగా అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను, స్వామి వారికి శాలువాను కానుకగా ఇచ్చారు. ఇదంతా తన మొక్కులో భాగంగా చేశానని విజయ్ తెలిపారు. అగ్గిపెట్టెలో దాగి ఉన్న చీరను 2012 లో తిరుపతిలో జరిగిన తెలుగు మహాసభల్లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగానే ఆవిష్కరింపజేశానని, ఆ సమయంలోనే తిరుపతిలో అమ్మవారికి చీర, స్వామి వారికి శాలువాను బహుకరించాలని అనుకున్నానని విజయ్ చెప్పారు. ఈ చీరను తానే స్వయంగా తయారు చేశానని, దీనికి రూ.15,000 లు ఖర్చు అయ్యిందని దీని ధర మార్కెట్లో రూ.30,000 ల వరకు ఉంటుందని ఆయన అన్నారు. విజయ్ తండ్రి పరంధాములు 1987 లో అగ్గిపెట్టెలో ఇమిడే చీర, కుట్టులేని జాకెట్, ఉంగరంలో దూరే చీరను మగ్గంపై నేశారు. అంతేకాకుండా చేనేత మగ్గంపై నేసిన జాతీయ పతాకం ఒలింపిక్ వేదికగా అట్లాంటాలో రెపరెపలాడుతుంది. ఆయన స్ఫూర్తితో విజయ్ కూడా కొత్తగా ఎన్నో కళాఖండాలను సృష్టించినట్లు చెప్పారు .