సమాచారం ఇవ్వండి..2 లక్షలు గెలవండి...!

SMTV Desk 2017-06-24 11:51:22  yogi aditya nath, up cm, uttara preadesh, offer for pregnency womans,

ఉత్తరప్రదేశ్, జూన్ 24 : సమాచారం ఇవ్వండి.. 2 లక్షలు గెలవండి అంటే ఇదేదో షాపింగ్ మాల్ ఆఫర్ అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. కొన్ని వైద్యశాలల్లోని వైద్యులు డబ్బులకు ఆశపడి, దొంగతనంగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న విషయం జగమెరిగిన సత్యం. అయితే ఇలాంటి వ్యవస్థను రూపుమాపడానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. లింగనిర్ధారణ పరీక్షలు జరిపే ఆసుపత్రులు, లేదా కేంద్రాల సమాచారం ఇచ్చిన వారికి 2 లక్షల రూపాయల భారీ నగదు బహుమతినిస్తామని ప్రకటించారు. జూలై 1 నుంచి అమలు కానున్న ఈ సరికొత్త పథకంలో బహుమతి నజరానా మూడు దఫాలుగా అందించనున్నారు. స్టింగ్ ఆపరేషన్ చేసి పట్టుకోగానే లక్ష రూపాయలు ఇస్తామని ఆయన తెలిపారు. ఈ మొత్తం ఆపరేషన్ విజయవంతం కాగానే అందిస్తామని, కేవలం సమాచారం అందిస్తే 60 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ మొత్తాన్ని విచారణ సందర్భంగా సాక్ష్యం చెప్పిన తరువాత ఇస్తారు. గర్భిణీకి తోడుగా వెళ్లినవారికి కూడా 40 వేల రూపాయలు అందించనున్నారు. యూపీలో ప్రతి 1000 మంది బాలురకు 902 మంది యువతులే అందుబాటులో ఉన్నారని, ఇలా చేయడం ద్వారా భ్రూణహత్యలు నివారించవచ్చని సీఎం వ్యూహం రచించారు.