బీజేపీ ఎంపీ చింతమన్‌ వనగ కన్నుమూత ..

SMTV Desk 2018-01-30 15:46:48  bjp mp, Chintaman Vanaga, passed away, rml

న్యూఢిల్లీ, జనవరి 30 : బీజేపీ సీనియర్‌ నేత, లోక్‌సభ ఎంపీ చింతమన్‌ వనగ (67) తుదిశ్వాస విడిచారు. తన ఇంటివద్ద అనూహ్యంగా పడిపోయిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రి (ఆర్‌ఎంఎల్‌)కు తరలించారు. ఆరగంట సేపు శ్రమించిన వైద్యులు శతవిధాలు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆయన మృతికి కారణాలు పరిశీలిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. ‘చింతమన్‌ను మంగళవారం ఉదయం 11.15 గంటల ప్రాంతంలో ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. మేం ఆయనను బతికించేందుకు అరగంటపాటు శ్రమించాం. అయినప్పటికీ ఆయన శరీరం చికిత్సకు స్పందించలేదు. దీంతో 11.45గంటలకు ఆయన చనిపోయినట్లు ప్రకటించాం’ అని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వీకే తివారి చెప్పారు. 1950 జూన్‌ 1న జన్మించిన వనగ తొలిసారి 1996లో 11వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. తర్వాత 1999లో, తాజాగా 2014లో మరోసారి 16వ లోకసభకు ఎన్నికయ్యారు. కాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ వర్గాలు, పలువురు ప్రముఖులు, ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.