జయహో ‘జయదేవ్’..

SMTV Desk 2018-01-29 10:52:32  ipl-11, auction, jayadev unadkath, benguluru

బెంగుళూరు, జనవరి 29 : ఐపీఎల్- 11సీజన్లో ముఖ్యమైన ఘట్టానికి తెరపడింది. దశాబ్దం తర్వాత జరిగిన ఆటగాళ్ల వేలం ప్రక్రియ నిన్నటితో ముగిసింది. రెండో రోజు వేలంలో టీమిండియా లెఫ్టార్మ్‌ పేస్‌ బౌలర్‌ జయదేవ్ ఉనద్కత్ ను అనూహ్యంగా రాజస్థాన్ జట్టు రూ11.5 కోట్లకు దక్కించుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. రెండో రోజు వేలంలో అత్యధిక ధర ఇదే కాగా, జయదేవ్ స్టోక్స్‌( రూ 12.5) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. అంతే కాకుండా ఈ సీజన్ లో భారత్ తరపున అత్యధిక ధర పలికిన ఆటగాడిగా జయదేవ్ నిలిచాడు. మరో వైపు కర్ణాటక ఆల్‌రౌండర్‌ గౌతమ్‌ కృష్ణప్ప రూ.6.2 కోట్లు కు రాజస్థాన్ జట్టు తమ వశం చేసుకుంది. విదేశీ ఆటగాళ్లలో ఆండ్రూ టై (ఆస్ట్రేలియా)ని పంజాబ్ జట్టు ఏకంగా రూ. 7.2 కోట్లకు కొనడం విశేషం. హైదరాబాద్ యువ తేజం మహ్మద్ సిరాజ్ ను గతేడాది ధర రూ.2.6 కోట్లకు బెంగుళూరు తీసుకుంది. చాలా మంది వెటరన్ ఆటగాళ్లు ఈ సీజన్లో ఆడే యోగం దక్కలేదు. వారిలో ఇషాంత్‌ శర్మ, టైల్‌మిల్స్, ఫాల్క్‌నర్, హాజల్‌వుడ్, ఏంజెలో మాథ్యూస్, మోజెస్‌ హెన్రిక్స్, హషీం ఆమ్లా, నాథన్‌ లయన్, జో రూట్, డ్వేన్‌ స్మిత్, మెక్లీనగన్, లసిత్‌ మలింగ, డారెన్‌ స్యామీ, రాస్‌ టేలర్, మోర్నీ మోర్కెల్, తిసారా పెరీరా, ఇర్ఫాన్‌ పఠాన్, అశోక్‌ దిండా, వరుణ్‌ ఆరోన్‌ ఉన్నారు. *169 అమ్ముడుపోయిన మొత్తం ఆటగాళ్ల సంఖ్య * 113 మొత్తం భారత ఆటగాళ్లు * 71 అన్‌క్యాప్డ్‌ భారత ఆటగాళ్లు * 56 మొత్తం విదేశీ ఆటగాళ్లు * ఫ్రాంచైజీలు వెచ్చించిన మొత్తం రూ. 431 కోట్ల 70 లక్షలు