"పద్మావత్‌" చిత్రానికి ఆగని నిరసన సెగ..

SMTV Desk 2018-01-25 12:07:43  padmaavath, movie, release isuue, protest raajputh leaders.

గుజరాత్, జనవరి 25 : ఎన్నో వివాదాలను దాటుకొని విడుదలకు సిద్దంగా ఉన్న "పద్మావత్" చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయనివ్వబోమని కర్ణిసేన, రాజ్‌పుత్‌ల మద్దతుదారులు విధ్వంసాలకు దిగారు. పట్టణాల్లో రహదారులను దిగ్బందించి పలు బస్సులకు నిప్పంటించారు. ఇప్పటికే ఈ తీవ్ర ఆందోళనల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లోని మల్టీప్లెక్స్‌ల యజమానులు ఈ చిత్రాన్ని తమ థియేటర్లలో ప్రదర్శించబోమని ప్రకటించారు. రాజ్‌పుత్‌ల మద్దతుదారులు ఢిల్లీ-జైపుర్‌ జాతీయ రహదారిని దిగ్బంధించారు. పలు వాహనాలను ధ్వంసం చేయగా అరగంటకు పైగా ఇక్కడ వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జైపుర్‌లో కర్ణిసేన సభ్యులు రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన రెండు బస్సులపై దాడికి పాల్పడ్డారు. మల్టీప్లెక్స్‌ల వెలుపల నిలిపి ఉంచిన 30 బైకులు, స్కూటర్లను ధ్వంస౦ చేశారు. ఇదిలా ఉండగా.. ఓ వైపు చిత్రం విడుదలకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. చిత్ర దర్శకులు సంజయ్‌ లీలా భన్సాలీ, నటి దీపికా పదుకొనే నివాసాల వద్ద ముంబయి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. కర్ణిసేన, రాజ్‌పుత్‌ల మద్దతుదారులు 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత సినిమా ప్రదర్శనపై ఒక నిర్ణయం తీసుకుంటామని భారత మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దీపక్‌ వెల్లడించారు. పలు రాష్ట్రాలు "పద్మావత్" చిత్రంపై నిషేధం విధించినప్పటికీ విడుదలకు సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే.