రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తాం : కేటీఆర్

SMTV Desk 2018-01-24 11:19:10  minister ktr speech, World Economic Summit, dovos,

హైదరాబాద్, జనవరి 24 : తెలంగాణ రాష్ర్టాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం లభిస్తుందని పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి ఇటీవల దావోస్ వెళ్ళిన కేటీఆర్.. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలిసారిగా ఈ సదస్సులో పాల్గొన్నానని, అతి పెద్ద వేదికలో పాల్గొనడం ఉద్విగ్నంగా ఉందన్నారు. అనంతరం ఈ సదస్సుకు హాజరైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కేటీఆర్‌ కలిశారు. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్‌ అంబానీ, ఎంపీ గల్లా జయదేవ్‌లతో భేటీ అయ్యారు. మంత్రి లోకేశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్‌.. వారితో కలిసి సెల్ఫీ దిగారు. కాగా ఐదు రోజుల పాటు జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో నేటి నుంచి పలు ప్రత్యేక చర్చల్లో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగిస్తారు. 25న "సమాజానికి డిజిటల్‌ సేవల అంశం"పై ప్రసంగిస్తారు. ఈ సదస్సు అనంతరం థాయ్‌లాండ్ దేశానికి చెందిన బహుళజాతి సంస్థ ఇండోరమా వెంచర్స్ చైర్మన్ అలోక్ లోహియాతో మంత్రి భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో బ్యాంకాక్‌ కేంద్రంగా పనిచేస్తున్న మెగా టెక్స్‌టైల్ పార్కును వరంగల్‌లో నెలకొల్పనున్నామని, పరిశ్రమకు ఉన్న అవకాశాలను అలోక్ లోహియాకు మంత్రి వివరించారు.