భారత్ బౌలర్లు 20 వికెట్లు తీశారు: ధోని

SMTV Desk 2018-01-20 11:41:38  dhoni, 20 wickets, test match, bowlers, south africa

చెన్నై, జనవరి 20: దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్‌ను చేజార్చుకుని భారత జట్టు విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కాగా భారత జట్టుకు మాజీ కెప్టెన్‌ ధోని అండగా నిలిచాడు. ఈ సిరీస్‌లో సానుకూల అంశాలూ ఉన్నాయని, బౌలర్లు అద్భుతంగా రాణించిన విషయం మరవద్దని ధోని చెప్పాడు. "ఓటమిపై కాకుండా సానుకూల అంశాలపై దృష్టి పెట్టండి. టెస్టు మ్యాచ్‌ గెలవాలంటే 20 వికెట్లు తీయాలి. మన బౌలర్లు ఆ పని చేశారు. ఒకవేళ 20 వికెట్లు తీయలేని పక్షంలో డ్రా గురించి ఆలోచించాలి. వికెట్లు తీయకుంటే తక్కువ పరుగులు చేసినా, భారీ స్కోరు సాధించినా డ్రా కోసం చూడాల్సిందే. మ్యాచ్‌లో ప్రత్యర్థిని రెండు సార్లు ఆలౌట్‌ చేయకుంటే స్వదేశంలో అయినా, విదేశాల్లో అయినా టెస్టు గెలవలేం. మన బౌలర్లు 20 వికెట్లు తీశారంటే.. మనం ఎప్పుడూ గెలిచే స్థితిలోనే ఉన్నామని అర్థం. ఒక్కసారి పరుగులు చేయడం మొదలుపెడితే విజయం మనదే" అని ధోని పేర్కొన్నాడు. రెండేళ్ల నిషేధం తర్వాత తిరిగి ఐపీఎల్‌లోకి ప్రవేశిస్తున్న చెన్నై సూపర్‌కింగ్స్‌ (సీఎస్కే) తరపున ఆడనుండడం సంతోషంగా ఉందని ధోని తెలిపాడు. "ఐపీఎల్‌లో సూపర్‌కింగ్స్‌ కాకుండా వేరే ఫ్రాంఛైజీ తరపున ఆడాలని నేనెప్పుడూ అనుకోలేదు. చెన్నై నాకు రెండో ఇల్లు లాంటిది. ఇక్కడి అభిమానులు నన్ను సొంతమనిషిలా చూస్తారు. వేరే జట్లకు చెందిన చాలామంది నన్ను సంప్రదించారు కానీ చెన్నైకే ఆడతానని చెప్పాను. సూపర్‌కింగ్స్‌ ఉండగా వేరే జట్ల తరపున ఆడాలనే ఆలోచనే లేదు" అని ధోని తెలిపాడు.