అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన భారత్‌

SMTV Desk 2018-01-18 15:11:12  India successfully test fires Agni 5 ballistic missile

న్యూఢిల్లీ, జనవరి 18 : నేడు ఉదయం భూ ఉపరితలం నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే ఖండాతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5ని భారత్‌ విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా తీర ప్రాంతంలోని అబ్దుల్‌ కలాం ద్వీపంలో ఉదయం 9.54 నిమిషాలకు ఈ పరీక్ష నిర్వహించినట్లు రక్షణ మంత్రి నిర్మల సీతారామన్‌ వెల్లడించారు. 17.5మీటర్ల పొడవైన అగ్ని-5 సుమారు 50 టన్నుల బరువు ఉంటుంది. డీఆర్డీఓ తయారుచేసిన ఈ క్షిపణి 1.5టన్నుల అణు వార్‌హెడ్‌ను మోసుకుపోగలదు. అగ్ని-5ని 2012 ఏప్రిల్‌లో, 2013 సెప్టెంబరులో, 2015జనవరిలో చివరగా 2016 డిసెంబరులో పరీక్షించారు. ఈ క్షిపణిని ప్రవేశపెట్టిన అనంతరం భారత్‌ ఖండాతర బాలిస్టిక్‌ మిస్సైల్‌ క్లబ్‌లో అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్‌, యూకే సరసన చేరనుంది. 5000 కిలోమీటర్ల స్ట్రైక్‌ రేంజ్‌ గల ఈ క్షిపణి చైనాలోని ఉత్తర ప్రాంతాల వరకు చేరుకోగలదు.