భారత్ ఘోర పరాజయం.. సిరీస్ ఓటమి..!

SMTV Desk 2018-01-17 16:24:29  second test match, defeat, south africa win, senchoorian, india

సెంచూరియన్, జనవరి 17‌: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘోర పరాజయం చవి చూసింది. భారత్ బ్యాట్స్ మెన్ మరోసారి దారుణ వైఫల్యంతో మరో టెస్టు ఉండగానే సిరీస్‌ను కోల్పోయింది. 287 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ నాలుగో రోజు 35/3తో నిలవగా.. చివరి రోజు దారుణ బ్యాటింగ్ వైఫల్యంతో 151 పరుగులకే కుప్పకూలింది. తొలి టెస్టు ఆడుతున్న సఫారీ బౌలర్ లుంగీ ఎన్గిడి ఆరు వికెట్లతో చెలరేగిన వేళ.. భారత బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలబడటానికే ఇబ్బంది పడ్డారు. అతడికి రబాడ విజృంభణ తోడవడంతో బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. దీంతో కోహ్లి నాయకత్వంలో భారత జట్టు తొలిసారి సిరీస్‌ను కోల్పోయింది. చివరి రోజు విజయానికి 252 పరుగులు అవసరమైన స్థితిలో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో రనౌట్ అయిన పుజారా రెండో ఇన్నింగ్స్‌లోనూ అవసరం లేని పరుగుకు యత్నించి రనౌట్ అయ్యాడు. తద్వారా రెండు ఇన్నింగ్స్‌ల్లో రనౌట్ అయిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. పార్థీవ్ (19), హార్దిక్ పాండ్య (6), అశ్విన్ (3) త్వరగా పెవిలియన్ చేరడంతో భారత్ కష్టాల్లో పడింది. ఈ దశలో రోహిత్ (47), షమీ (28) ఆదుకునే ప్రయత్నం చేశారు. ఎనిమిదో వికెట్‌కు వీరిద్దరూ 54 పరుగులు జోడించారు. రోహిత్‌ను రబాడ పెవిలియన్‌కు పంపిన కాసేపటికే భారత్ ఆలౌటయ్యింది. దీంతో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు సంబరాల్లో మునిగిపోయింది.