పని తీరు మార్చుకున్న ఏపీపీఎస్సీ

SMTV Desk 2017-06-21 19:20:47  Andhra Pradesh Government,APPSC Chairman Pinnamaneni Udyabhaskar,Group-2,Group-3

అమరావతి, జూన్ 21: గత కొన్ని సంవత్సరాల క్రితం ఉన్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ఏపీపీఎస్ సీ) పని తీరును గమనిస్తే తరుచూ వివాదాలు , వాటి కారణంగా ఉద్యోగ నియామక పరీక్షలను నిర్వహించడంలో జాప్యం వంటివి జ్ఞాపకం రాక తప్పదు. కాని 2015 నవంబర్ 27 వ తేదీ నుంచి ఆ పరిస్థితులు కనుమరుగయ్యాయి. ఎందుకంటే ఆ రోజున ఏపీపీఎస్సీ చైర్మన్ గా పిన్నమనేని ఉదయభాస్కర్ ను, కార్యదర్శిగా వైవిఎస్టి శాయినిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత గత సంవత్సరంలో ఇతర సభ్యులుగా కొత్తవారిని కూడా నియమించింది. దీని ఫలితంగా ఏపీపీఎస్సీ ఉద్యోగ నియామక పరీక్షలను వివాదాలు చోటు చేసుకోకుండ నిర్వహించడంలో సఫలమైంది. గత నియామకాలకు సంబంధించి జాప్యంలో ఉన్న కోర్టు కేసులను వడివడిగా పరిష్కరించుకుంటూ ముందడుగు వేస్తుంది. ముఖాముఖిలపై అభ్యర్థులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకుంటు, సాధ్యమైనంతగా ఇంటర్వ్యూ అవసరం లేకుండానే నియామకాలను చేపడుతుంది. 1999 నాటి గ్రూప్‌-2 సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి తాజాగా తుది ఎంపిక ప్రక్రియను విడుదల చేసి ప్రభుత్వ విభాగాలకు కూడా చేరవేసింది. దాదాపు 17 సంవత్సరాలుగా ఈ నియామకంపై వివాదం జరుగుతుండగా ఇప్పుడు దానికి పరిష్కారం లభించింది. ఇక 2008 నాటి జూనియర్ లెక్చరర్స్ ఎకనామిక్స్‌ వివాదాన్ని కూడా ఏపీపీఎస్సీ తాజాగా ఓ కొలిక్కి తీసుకువచ్చింది. గ్రూప్‌-2011 సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ సమస్యను ఈ నెలాఖరులోగా పరిష్కరించే యోచనలో ఉన్నామని ఏపీపీఎస్సీ వర్గాలు వెల్లడించాయి. 2016 జూన్ వరకు ఏపీపీఎస్ సీకి ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ 4009 పోస్టులకు అనుమతి ఇవ్వగా, డిసెంబర్ 31 వరకు కొన్ని ప్రత్యేక నోటిఫికేషన్ లను ప్రకటించింది. ఈ సంవత్సరంలో చేపట్టాల్సిన నియామకాలకు అకాడమిక్ క్యాలెండర్ ను ఆధారంగా చేసుకొని 4,275 పోస్టులకు 34 నోటిఫికేషన్ లను విడుదల చేయాలని కమీషన్ నిర్ణయించింది. దీనిలో భాగంగా 7 నోటిఫికేషన్ లను విడుదల చేయడంతో 1000 పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వ విభాగాలకు యూనిట్ లిస్టు లను పంపింది. మిగతా 27 నోటిఫికేషన్ లను డిసెంబర్ వరకు విడుదల చేసేలా సన్నాహాలు చేస్తుంది. అందులో భాగంగా గ్రూప్-2 కి 982, గ్రూప్‌-3 సర్వీసెస్‌ లో 1055 పోస్టుల నియామకానికి ఇప్పటికే స్ర్కీనింగ్‌ టెస్ట్‌ పూర్తి అయినందున, గ్రూప్‌-2 మెయిన్స్‌ జూలై 15-16 తేదీల్లో, గ్రూప్‌-3 మెయిన్స్‌ ఆగస్టు 6న నిర్వహించాలని నిర్ణయించింది. వచ్చే సెప్టెంబర్‌లోగా ఈ రెండు రిక్రూట్‌మెంట్లు పూర్తిచేయాలని ఏపీపీఎస్సీ భావిస్తున్నట్లు సమాచారం.