వ్యవసాయ మార్కెట్లకు సింగిల్ లైసెన్స్ ల ఆమోదం: సీఎం కేసీఆర్

SMTV Desk 2017-06-21 19:09:07  Single license, Chief Minister K. Venugopalan Candrasekharravu,Agricultural markets

హైదరాబాద్, జూన్ 21 : తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ల వ్యాపారులకు ఇక పై సింగిల్‌ లైసెన్స్‌ విధానాన్ని ప్రవేశ పెట్టాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం దీనికి సంబంధించిన ఫైలుపై ఆయన సంతకం చేశారు. ఏ వ్యాపారి అయినా ఒక మార్కెట్‌లో లైసెన్స్‌ తీసుకుంటే రాష్ట్రంలోని ఇతర మార్కెట్‌లలో కూడా వ్యాపారం చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుందని, దీనివల్ల వ్యాపారులు పలు చోట్ల లైసెన్సులు తీసుకునే అవసరం ఉండదని తెలిపారు. మార్కెట్లలో ఎక్కువ మంది వ్యాపారులు ఉండటం వల్ల రైతులకు సరైన గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం ఒక వ్యవసాయ మార్కెట్‌లో లైసెన్స్‌ కలిగి ఉన్న వ్యాపారులు మరో మార్కెట్‌లో కొనుగోలు చేయడానికి అవకాశం లేదు. దీనివల్ల ప్రతి మార్కెట్‌లో లైసెన్స్‌ ఉన్న కొందరు వ్యాపారులే ఉండటంతో నామ మాత్రపు పోటీ ఉంటుంది. దీంతో రైతులకు సరైన గిట్టుబాటు ధర రావడం లేదు. ఒక మార్కెట్‌లో లైసెన్స్‌ తీసుకున్న వ్యాపారి రాష్ట్రంలోని ఇతర మార్కెట్లలో కూడా కొనుగోలు చేయడానికి అవకాశం కల్పిస్తే ప్రతి మార్కెట్‌లోనూ పోటీ పెరిగి రైతులకు మేలు జరుగుతుందని మంత్రి హరీశ్‌రావు.. సీఎం కేసీఆర్‌కు స్పష్టం చేశారు. సానుకూలంగా స్పందించిన కేసీఆర్‌ రాష్ట్రంలో సింగిల్‌ లైసెన్స్‌ విధానాన్నివెంటనే అమలు చేయాలని ఆదేశించారు. ఈ కొత్త విధానంతో రాష్ట్రంలోని అన్ని మార్కెట్‌ యార్డుల్లో లావాదేవీలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులు దేశ వ్యాప్తంగా వ్యాపారాలు నిర్వహించుకునేందుకు అవకాశం ఏర్పడింది. ఒకసారి లైసెన్స్‌ తీసుకున్నవారు నేరుగా ఇతర రాష్ర్టాలకు ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు సైతం అవకాశం కల్పిస్తున్నారు. కాగా రానున్న రోజుల్లో ఈ-పర్మిషన్‌ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఒకసారి లైసెన్స్‌ తీసుకున్న వ్యాపారులు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునేందుకు ఈ-పర్మిషన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం సమాకురుతుందని వెల్లడించారు.