హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్‌ ఎన్నిక అప్రజాస్వామికం: అజార్‌

SMTV Desk 2018-01-13 13:52:06  ajaruddin, hca, president, vivek, nondemocratic

హైదరాబాద్‌, జనవరి 13: హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు వివేక్ వ్యవహార శైలి సరిగా లేదని... ఆయన ఎన్నిక అప్రజాస్వామికంగా జరిగిందని భారత క్రికెట్ జట్టు మాజీ సారధి, మాజీ ఎంపీ మహ్మద్ అజారుద్దీన్ ఆరోపించారు. వివేక్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అజహర్ పేర్కొన్నారు. లోధా కమిటీ ప్రతిపాదనలను హెచ్‌సీఏ అమలు చేయడం లేదని ఆయన మండిపడ్డారు. హెచ్‌సీఏ అవినీతిపై విచారణ జరిపించాలని అజహర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ క్రికెట్ సంఘ పాలకవర్గ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. తెలంగాణ క్రికెట్ సంఘంతో తనకెలాంటి సంబంధం లేదని అజహర్ పేర్కొన్నారు. తెలంగాణలో క్రికెట్‌ను అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందని... అందుకు తనవంతు సహకారం అందిస్తానన్నారు. తెలంగాణ క్రికెట్‌ బాగుపడుతుందంటే తాను ఎన్ని గంటలైనా గేటు బయటే ఉంటానని ఆయన చెప్పారు. హైదరాబాద్ నుంచే క్రికెట్ ఆడి... భారత జట్టుకు ఎంపికయ్యాయని తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి తాను ఎన్నికల్లో పోటీ చేయడం తప్పా అని ఆయన ప్రశ్నించారు.