నేటి నుంచే దక్షిణాఫ్రికాతో భారత్ రెండో టెస్టు

SMTV Desk 2018-01-13 11:11:45  second test, start, south africa, india, senchootian

సెంచూరియన్‌, జనవరి 13: కేప్‌టౌన్‌ టెస్టులో మంచి అవకాశమొచ్చినా ఉపయోగించుకోలేక ఓడిపోయిన భారత జట్టుకు ఇప్పుడు రెండో పరీక్ష మొదలవుతుంది. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికా, భారత్ ల మధ్య రెండో టెస్టు ఈ రోజు మధ్యాహ్నం 1.30 నుంచి ప్రారంభం కానుంది. సిరీస్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే టీమ్‌ఇండియా ఈ టెస్ట్ మ్యాచ్ తప్పక నెగ్గాల్సిన ఆవశ్యకత ఉంది. సాంకేతికంగా అత్యుత్తములైన బ్యాట్స్‌మెన్‌ను సైతం హడలెత్తించగలిగే ఆతిథ్య పేసర్లను సెంచూరియన్‌లో ఎదుర్కోవడం మరీ కష్టం. ఇంతకుముందెప్పుడూ భారత్‌ సహా ఉపఖండ జట్టేదీ ఇన్నింగ్స్‌ ఓటమి చవిచూడకుండా ఇక్కడి నుంచి వెళ్లలేదు. దీన్ని బట్టే కోహ్లీసేన ముందున్నది ఎంత పెద్ద సవాలో అర్థం చేసుకోవచ్చు. చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో భారత్‌ను బెంబేలెత్తించడానికి మరో బౌన్సీ పిచ్‌ కసిగా ఎదురుచూస్తోంది. కేప్‌టౌన్‌లో ఆతిథ్య పేసర్లకు దీటుగా భారత పేసర్లు రాణించినా.. బ్యాట్స్‌మెనే తీవ్రంగా నిరాశపరిచారు. బౌలర్లు గొప్పగా రాణించినా బ్యాట్స్‌మెన్‌ బొక్కబోర్లా పడడంతో మొదటి టెస్టులో భారత్‌కు పరాభవం తప్పలేదు. వాళ్లు పోరాడితే తప్ప రెండో టెస్టులో భారత్‌ విజయాన్ని ఆశించలేం. మ్యాచ్‌ వేదిక సూపర్‌స్పోర్ట్‌ పార్క్‌ (సెంచూరియన్‌)లోని పిచ్‌ సాధారణంగా మంచి పేస్‌, బౌన్స్‌కు సహకరిస్తుంది. ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న భారత్‌.. జోరుమీదున్న దక్షిణాఫ్రికా ముందు ఏ మేర నిలుస్తుందో వేచిచూడాలి.