ట్రంప్ నుంచి కూచిబొట్ల భార్యకు అందిన ఆహ్వానం...

SMTV Desk 2018-01-12 17:27:33  An invitation from the trump to the wife of the kuchibotla srinivas sunayana

వాషింగ్టన్‌, జనవరి 12 : గతేడాది దుండగుల దాడిలో చనిపోయిన ప్రవాసాంధ్రుడు శ్రీనివాస్ కూచిబొట్ల భార్య సునయనకు అమెరికాలో అరుదైన అవకాశం దక్కింది. అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల్లో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తొలి ప్రసంగం చేయనున్న వేళ, ఆ కార్యక్రమానికి రావాలని సునయనకు ఆహ్వానం అందింది. ఈ నెల 30న స్టేట్‌ ఆఫ్‌ యూనియన్‌ అడ్రెస్‌ ఈ సదస్సుకు హాజరుకావాలని కాంగ్రెస్ సభ్యుడు కెవిన్‌ యోడర్‌ ఆమెను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...భర్తను కోల్పోయిన సమయంలో ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించి, ప్రతికూల పరిస్థితులను ఎదురుకుని అందరికీ ఆదర్శంగా నిలిచిన్నందునే ఆమెను కాంగ్రెస్ సమావేశంలో పాల్గొనమని చెప్పినట్లు యోడర్‌ వివరించారు. శ్రీనివాస్ మరణంతో అమెరికాలో ఉండే అవకాశం కోల్పోయినప్పటికి ఎంతో ధైర్యంగా పోరాడి సునయన అమెరికా పౌరసత్వాన్ని నిలబెట్టుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆహ్వానాన్ని స్వీకరించిన సునయన తనపై చూపిన అభిమానానికి ధన్యవాదాలు చెప్పారు. తప్పకుండా కాంగ్రెస్ భేటీకి హాజరవుతానని తెలిపారు.