ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ డ్రా

SMTV Desk 2018-01-12 15:21:47  Australian open, draw, start, Melbourne, tennis

మెల్‌బోర్న్‌, జనవరి 12: ప్రతియేటా జరగనున్న నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్ టోర్నీలలో మొట్టమొదటిగా జరిగే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ డ్రా వెలువరించారు. దిగ్గజ ఆటగాళ్ళు పాల్గొనే ఈ మెగా టోర్నీలో కెరీర్‌లో 20వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై కన్నేసారు స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌. అతను ఆస్ట్రేలియా ఓపెన్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్దమవుతున్నాడు. సోమవారం ఆరంభమవుతున్న ఈ గ్రాండ్‌స్లామ్‌లో.. 51వ ర్యాంకు ఆటగాడు అల్జాజ్‌ బెడెన్‌ (స్లొవేనియా)తో మ్యాచ్‌తో అతడు టైటిల్‌ వేటను ఆరంభించనున్నాడు. గురువారం తీసిన టోర్నీ పురుషుల సింగిల్స్‌ డ్రా ప్రకారం డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫెదరర్‌కు క్వార్టర్‌ఫైనల్లో డేవిడ్‌ గొఫిన్‌ (బెల్జియం) ఎదురయ్యే అవకాశముంది. అంతకుముందు నాలుగో రౌండ్లో అతడికి భారీ సర్వ్‌లు చేసే రోనిచ్‌ (కెనడా) ఎదురుకావొచ్చు. మరోవైపు ప్రపంచ నంబర్‌వన్‌, టాప్‌ సీడ్‌ రఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) తొలి రౌండ్లో 83వ ర్యాంకు ఆటగాడు విక్టర్‌ బుర్గోస్‌ (డొమినికన్‌ రిపబ్లిక్‌)తొ తలపడనున్నారు. క్వార్టర్‌ఫైనల్లో అతడికి మారిన్‌ సిలిక్‌ (క్రొయేషియా) ఎదురయ్యే అవకాశముంది. ఆరు సార్లు ఛాంపియన్‌ నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా)కు కాస్త కఠిన డ్రానే ఎదురైంది. గాయం కారణంగా ఆరు నెలలపాటు ఆటకు దూరమైన అతడు ఈ టోర్నీలో 14వ సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. తొలి రౌండ్లో అమెరికా యువ ఆటగాడు డొనాల్డ్‌ యంగ్‌ను ఎదుర్కొంటాడు.