ఘనంగా తెలంగాణ జాతిపిత 6వ వర్ధంతి వేడుకలు

SMTV Desk 2017-06-21 16:38:11  prof.jayashankar 6th Death anniversary, thelangana, kalvakuntla chandrashekar,

హైదరాబాద్, జూన్ 21 : తెలంగాణ జాతిపిత, సిద్దాంతకర్తగా పేరొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటులో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. జయశంకర్ వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామ శివారు అక్కంపెటలో జన్మించారు. ఆయన రాష్ట్ర ఏర్పాటు కళ్లారా చూడాలని తరుచుగా చెప్పేవారు. కాని 2011, జూన్ 21న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందే మరణించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన 6వ వర్ధంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో జయశంకర్ వర్థంతి సందర్భంగా జాయింట్ కలెక్టర్ సురేశ్‌పొద్ధార్, ఆర్డీవో విశ్వనాథం, జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ నేతలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అదే విధంగా మెదక్ జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మండల పరిషత్ కార్యాలయంలో ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి జయశంకర్ అమర్ రహే... అంటూ నినాదించారు. నాగర్‌కర్నూలు జిల్లాలో జయశంకర్ వర్థంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ శ్రీధర్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు, నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు మాట్లాడుతూ జయశంకర్ తన ఆస్తిని, జీవితాన్ని తెలంగాణకు అంకితం చేశారని అంతటి గొప్ప వ్యక్తి తెలంగాణ ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.